తెలంగాణ స‌మాజంలో బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీల‌ను త‌మ వైపు మ‌లుపు కోవాల‌ని బీజేపీ ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తోంది. కానీ ఆశ‌యం.. అమ‌లుకు నోచుకోవడం లేదు. పార్టీలో బీసీల‌కు త‌గిన ప్రాధాన్యం క‌ల్పించకుండా బీసీల‌ను ఎలా పార్టీ వైపు ఆక‌ర్షితుల‌ను చేస్తార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయితే అడ‌పాద‌డ‌పా మిగ‌తా పార్టీల‌క‌న్నా మేమే కాస్త న‌యం అన్న రీతిలో బీసీల‌కు పార్టీ ప‌ద‌వుల్లో చోటిస్తూ వ‌స్తోంది. ఫ‌లితంగానే కొన్ని ప్రాంతాలు, ప‌ట్ట‌ణాల్లో బీజేపీ బ‌లం పెరిగింద‌న్న‌ది వాస్త‌వం. అందుకే ప‌ట్ట‌ణ ఓట‌ర్ల‌ను మ‌రింత‌గా స‌మీకృతం చేసి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి టీఆర్ ఎస్‌ను దెబ్బ‌కొట్టాల‌ని యోచిస్తోంది. తెలంగాణ గ్రామీణంలో టీఆర్ ఎస్ పార్టీ అత్యంత దుర్బేధ్యంగా ఉంద‌న్న మాట వాస్త‌వం.



ఇది అన్ని రాజ‌కీయ ప‌క్షాలు అంగీక‌రించి తీరాల్సిందే. కాంగ్రెస్ కంచుకోట‌లు కూడా దెబ్బ‌తిన్నాయి. కారు ధాటికి ఇప్ప‌ట్లో అక్క‌డ పార్టీని ఓ మాదిరిగా కూడా నిల‌బెట్ట‌లేమ‌ని చెబుతున్న కాంగ్రెస్ నేత‌లు క‌న‌బడుతున్నారు. ఇదిలా ఉండ‌గా బీసీ మంత్రంతో మ‌రోసారి బీజేపీ ముందుకు వ‌స్తోంది. అయితే ఈ సారి కాస్త గ్రౌండ్ లెవ‌ల్‌కు పార్టీని తీసుకెళ్ల‌డంపై దృష్టి పెడుతామంటూ ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. బీసీల్లేకుండా తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం ఏ పార్టీకి సాధ్యం కాదు. కానీ అలాంటి బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి ఏళ్లుగా జ‌రుగుతున్న అన్యాయాల‌ను జ‌నంలోకి తీసుకెళ్లి చైత‌న్యం తీసుకువ‌స్తామంటూ ఉద్ఘాటిస్తున్నారు.



ఇదిలా ఉండ‌గా తెలంగాణలో బీసీలను కూడగట్టి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. సోమవారం ఢిల్లీలో మోర్చా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీలను అణిచివేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీల వాటాను కాజేసే ప్రయత్నం చేస్తోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో బీసీలకు అనేక ఆంక్షలు విధిస్తూ తీరని అన్యాయం చేస్తోందని  చెప్ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: