అన్లాక్ మార్గదర్శకాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసును ప్రారంభించేందుకు   అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులను ప్రారంభించాయి.  అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభం కాలేదు అన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల మధ్య అంతత్  రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించు కునేందుకు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ విఫలం అయ్యాయి. పలుమార్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదనలు పంపినప్పటికీ తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు.



 ఇక గతంలో తెలంగాణ ఆర్టీసీ కోరిన విధంగానే ఏపీఎస్ఆర్టీసీ ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ కి మరోసారి ప్రతిపాదనలు పంపింది. కానీ ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. హైదరాబాద్ నుంచి ఏపీ లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎంతో మంది ప్రజలు ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మాపో  రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తున్నప్పటికీ తాజాగా తెలంగాణ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాత్రం అలాంటి అవకాశం లేదు అన్నది అర్ధమవుతుంది.



 ఇటీవల జంట నగరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏకంగా మూడు వేల బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. అయితే ప్రతి ఏడాదీ దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు నడిపేవారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  ఒప్పందం కుదరక పోవడంతో పండుగ సీజన్లో ప్రత్యేక సర్వీసులకు బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో..  ఈ పండుగ సీజన్లో  ఏపీకి బస్సు సర్వీసులు ప్రారంభించే అవకాశం లేనట్లు విశ్లేషకులు  అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్ తగులుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: