ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారిని అంతం అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ వైరస్ ని సమర్థంగా నివారించేందుకు పరిశోధనలు జరుగుతున్న వేళ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పుట్టగొడుగులపై చేసిన పరిశోధన విజయవంతమైంది. పుట్టగొడుగులలో మెండుగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్స్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కరోనాకు చెక్ పెట్టొచ్చునని పరిశోధనలో తేలింది.

ఇక పుట్టగొడుగులలో శరీరానికి ఆరోగ్యకరమైనవిగా భావించే అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, సోడియం మరియు కాల్షియం వంటి ఖనిజాలు వీటిలో అధికంగా ఉంటాయి. పుట్టగొడుగులలో విటమిన్ బి 3, బి 9, డి వంటి అనేక విటమిన్లు ఉంటాయి. అవి కూడా కేలరీలను తక్కువగా కల్గి ఉంటాయి. కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

పుట్టగొడుగులతో చేసిన ఫుడ్ సప్లిమెంట్ కరోనా వైరస్‌కు తక్షణ విరుగుడుగా ఉపయోగించవచ్చని పరిశోధకులు తేల్చారు. ఇందులో భాగంగా అటల్ ఇంక్యుబేషన్‌లోని స్టార్టప్ సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీతో సంయుక్త పరిశోధనలు చేసింది. ఔషధ ఆహార ఉత్పత్తి సంస్థ ఆంబ్రోషియా ఫుడ్ ఫామ్‌తో కలిసి పుట్టగొడుగులతో చేసిన సప్లిమెంటును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాలు చేపట్టింది. పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కర్కమిన్‌తో కలిసి ద్రవ రూపంలో ఈ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

ఇక పసుపు మిశ్రమంతో కలిసిన ఈ ఆహారం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతోపాటు యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫుడ్ సప్లిమెంటుపై ఎయిమ్స్ ఇప్పటికే పరీక్షలు నిర్వహిస్తుండగా, ఎయిమ్స్ నాగ్‌పూర్, భోపాల్, నవీ ముంబై కేంద్రాల్లోనూ ప్రయోగాలు సాగుతున్నాయి. వచ్చే ఏడాది తొలి నాళ్లలో ఈ ఫుడ్ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీసీబీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఈ సందర్బంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: