తెలుగు రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే వరదలతో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా భారీ వర్షం సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇలాంటి సమయంలో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు.. ప్రజల్ని టెన్షన్‌ పెడుతున్నాయి.

దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ రెండిటి కారణంగా ఏపీ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, సముద్రంలో అలల ఉధృతి పెరిగి, తీరం వెంట 45 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

అటు తెలంగాణలోనూ వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో అక్కడక్కడా వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్సుందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది వాతావరణశాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అధికారులు, మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, విపత్తు సహాయ బృందాలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పాత ఇళ్లు, శిథిల భవనాల్లోని వారు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.

తెలంగాణపై క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కనిపిస్తోంది. ఈ తరహా మేఘాలు చాలా దట్టంగా ఉంటాయి. ఇవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో అతి భారీ వర్షాన్ని కురిపిస్తాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని చాలా కాలనీలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. మరోసారి భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటని నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎల్బీనగర్, చార్మినార్‌ సర్కిళ్లలో తీవ్ర ప్రభావం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: