ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా మరో 10 శాతం వరకు ఖర్చు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. మారిన నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.30.80 లక్షలు, ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.77 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. చిన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో (ఎన్నికల సంఘం పేర్కొన్న రాష్ట్రాల్లోని జనాభా తక్కువ ఉండే నియోజకవర్గాలు) రూ.22 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో తాజా సవరణలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. సవరించిన నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయన్న కేంద్రం స్పష్టం చేసింది.

పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రాల్లో అభ్యర్థులు గరిష్ఠంగా ఖర్చు చేసుకునే మొత్తం ప్రస్తుతం ఉన్న రూ.28 లక్షల నుంచి రూ.30.8 లక్షలకు పెరిగింది. చిన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ మొత్తం ప్రస్తుతం ఉన్న రూ.20 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు పెరిగింది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28న తొలి దశ పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో దశ పోలింగ్ ఉంది. ఈ ఎన్నికల నేపథ్యంతో తాజా నిర్ణయం అభ్యర్థుల గెలుపోటములపై కాస్త ప్రభావం చూపనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఈ నిర్ణయం కలిసి రాగా.. ఆర్థికంగా అంతగా లేని అభ్యర్థులకు మరింత నష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: