విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య కేసులో న్యాయం చేయాలంటూ.. ఆమె తల్లిదండ్రులు సీఎం జగన్‌ను కలిశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చిన జగన్‌... 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు... ఈ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు... వీలైనంత త్వరగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏపీలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి దివ్య హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. తనకు తానే గాయాలు చేసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు నాగేంద్ర ఆరోగ్య పరిస్థితిని బట్టి... అతణ్ని అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 161వ స్టేట్‌మెంట్‌గా దివ్య తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌కు అందజేశారు. దివ్య హత్యకు సంబంధించి ఆర్ఎఫ్ఎస్ ఎల్ రిపోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

మెడపై తీవ్ర గాయం కారణంగానే దివ్య చనిపోయినట్లు... పోలీసులకు అందిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉంది. బలమైన గాయం, అధిక రక్తస్రావం వల్లే దివ్య ప్రాణాలు వదిలినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆమె కడుపులో రెండు అంగుళాల మేర కత్తిపోట్లు కూడా ఉన్నాయని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఆమె చేతి మీద కూడా కత్తిగాట్లు గుర్తించారు. పోస్ట్‌మార్టం రిపోర్టుతో పాటు రెండు రోజుల్లో ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్‌ రాగానే... నాగేంద్రను అరెస్ట్ చేసి, ఆ తర్వాత ఛార్జ్‌షీట్‌ వేయనున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దివ్య పోస్ట్ చేసిన వీడియోను కూడా ఓ ఆధారంగా చేర్చనున్నారు.. పోలీసులు.

ఈ కేసులో నిందితుడు నాగేంద్రకు సహకరించిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దివ్య పేరుతో ఫేక్ అకౌంట్స్ నడిపిన వారి గురించి ఆరా తీయటంతో పాటు భీమవరంలో దివ్య చదివిన కాలేజీలోని ఆమె ఫ్రెండ్స్‌ నుంచి కొన్ని వివరాలు రాబట్టారు. నిందితుడు నాగేంద్ర స్నేహితుల్ని కూడా అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్నారు. దివ్య హత్యకు ముందు ఆమె ఇంటికి నాగేంద్ర వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకోవడంతో పాటు... దివ్య, నాగేంద్ర ఫోన్లలోని మెస్సేజ్‌లను విశ్లేషిస్తున్నారు.

మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ దివ్య తల్లిదండ్రులు... సీఎం జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. వారి వేదన చూసి చలించిన జగన్‌... కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: