భారీ వర్షాలకు హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల వరద కష్ణాలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న చాలా మంది ఇంకా సాయం కోసం ఎదురుచూస్తునే ఉన్నారు. కొన్ని కాలనీల్లో వరద, మరికొన్ని కాలనీల్లో బురద... చాలా చోట్ల పేరుకుపోయిన చెత్తాచెదారం... ఇదీ నగరంలో పరిస్థితి.

హైదరాబాద్‌ వాసుల్ని వరద కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని కాలనీలు ఇంకా ముంపులోనే ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో బురద భారీగా పేరుకుపోయింది. వ్యర్థాలు, చెత్తాచెదారంతో కాలనీలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. వరద నీళ్లు వెళ్లిపోయినా... పేరుకుపోయిన బురదను తొలగించేందుకు అవస్థలు పడుతున్నామని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద అంబర్‌పేటలోని కల్వంచ... జల దిగ్బంధంలోనే ఉంది. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు, నేతలు... పత్తాలేకుండా పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్యాస్‌ అయిపోయిందని, నిత్యావసరాలు కూడా లేవని... రాత్రిపూట ఇళ్లలోకి పాములు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హయత్‌నగర్‌ పరిధిలోని బంజారా కాలనీలో వరద తీవ్ర కాస్త తగ్గడంతో... తడిసిపోని నిత్యావసరాలు, వస్తువులు ఏమైనా ఉంటే తీసుకెళ్దామన్న ఆశతో జనం ఇళ్లకు వస్తున్నారు. మోకాల్లోతుకుపైగా ఉన్న నీళ్లలోనే సామాన్లు తీసుకెళ్తున్నారు. కొందరు తమ నిత్యావసరాలు తడిసిపోయాయని... ప్రభుత్వమే ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు.

బీఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌లో ఐదు కాలనీలు, మీర్‌పేట చెరువు దిగువ ప్రాంతాలు, బాలాపూర్‌ ఏరియాలోని కొన్ని కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పాతబస్తీలోని నదీమ్‌ కాలనీ, హఫీజ్‌బాబా నగర్‌... పేరుకుపోయిన బురదతో దారుణంగా తయారయ్యాయి. వర్షాలు ఇంకా పడతాయన్న అంచనాలతో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకో, బంధువుల ఇళ్లకో వెళ్లిపోతున్నారు.

తాజా వర్షాలకు... జిల్లెలగూడ, మీర్ పేటలోని చెరువులు ఉగ్రరూపం దాల్చాయి. మీర్‌పేట చెరువు కట్ట తెగిందనే ప్రచారం జరగడంతో... మంత్రి సబితా ఇంద్రారెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కట్ట తెగిపోయిందనే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని... నీళ్లు లీక్‌ అవుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి ప్రమాదాన్ని నివారించామని చెప్పారు. మరోవైపు... భారీ వర్షాలు పడొచ్చనే హెచ్చరికలతో... లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్‌ఎంసీ ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: