తెలుగుదేశం పార్టీలో కష్ట పడిన వారికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, అందరిని తాను గుర్తు పెట్టుకుంటాను అని, పార్టీ కోసం కష్టపడుతున్న వారికి పదవులు తప్ప ఇంకెవరికీ పదవులు ఇచ్చేది లేదంటూ గతంలో నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. దీంతో పార్టీపై నిజంగా ప్రేమాభిమానాలు పెంచుకున్న ఆ పార్టీ వీరాభిమానులు అంతా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, వైసీపీ ప్రభుత్వం వేధింపులను, కేసులను, విమర్శలను ఎదుర్కుంటూనే నిత్యం ప్రభుత్వంపై పోరాటం చేస్తూ, తమకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ కోసం కష్టపడుతూనే వస్తున్నారు. తమకు అధినేత ఎప్పటికైనా న్యాయం చేస్తారని ఎదురుచూపులు చూసినవారందరికీ ఇప్పుడు బాబు వెన్నుపోటు పొడిచినట్టుగానే ఇప్పుడు వీరవిధేయులంతా భావిస్తున్నారు.


 కొత్తగా చేపట్టిన పార్టీ కమిటీల నియామకాల విషయాన్నే చూసుకుంటే, పార్టీ మారుతారు అనుకున్న వారికి, బాబు సామజిక వర్గానికి చెందిన వారికీ పదవులు కట్టబెట్టారు తప్పితే, క్షేత్రస్థాయిలో టిడిపి కోసం పాటుపడుతున్న వారిని బాబు మర్చిపోయినట్టుగానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకుంటే మాజీ మంత్రి పీతల సుజాత విషయంలో చంద్రబాబు ఆమెకు అన్యాయం చేశారనే వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా ఆమె చక్కటి పనితీరుని కనబరిచినా, కొంతమంది నాయకుల వెన్నుపోటు రాజకీయాల కారణంగా మధ్యలోనే మంత్రి పదవి పోగొట్టుకున్నారు. అయినా పార్టీ పైన ఎటువంటి విమర్శలు చేయకుండా, వెన్నుపోటు రాజకీయాలు ఎదుర్కొంటూనే ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

 ఒక దశలో చంద్రబాబు, లోకేష్ సైతం సుజాతను అనవసరంగా మంత్రి పదవి నుంచి తప్పించామనే బాధను అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ చింతలపూడి నియోజకవర్గం నుంచి సుజాతకు పోటీ చేసే అవకాశం కల్పిస్తారని అందరూ భావించగా, బాబు మాత్రం ఆమెను పక్కనపెట్టారు. దీంతో పార్టీ కేడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పీతల సుజాత కు తప్పితే ఎవరికి అక్కడ టికెట్ ఇచ్చినా, గెలుపు అసాధ్యమనే అంచనాలను నిజం చేస్తూ అక్కడి సీటుని చేజార్చుకుంది. అంతకు ముందే ఆమెకు వైసీపీ నుంచి టికెట్ ఆఫర్ రావడం, ఆమె కనుక పార్టీలో చేరితే మంత్రి పదవిని సైతం ఇచ్చేందుకు వైసీపీ ముందుకు రావడం వంటి పరిణామాలు జరిగినట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరిగింది.

 అయినా ఆమె మాత్రం టిడిపిని వదిలిపెట్టకుండా, పార్టీపై ఉన్న అభిమానంతో ఇప్పటికి టిడిపి తరఫున ప్రజా సమస్యల విషయంలో గొంతెత్తుతూ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం వైసీపీపై విమర్శలు చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కేసులు నమోదు అవ్వడం వంటి వ్యవహారాలు ఎన్నో ఏపీలో చోటుచేసుకుంటున్నాయి. అయినా సుజాత మాత్రం వాటికి భయపడకుండా, టిడిపి తరఫున వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. కానీ ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా బాబు పక్కన పెట్టడం పై పీతల వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇటీవల ప్రకటించిన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం విషయంలోనూ, రాష్ట్ర కమిటీలోనూ ఆమెకు ఎక్కడా చోటు కల్పించించకుండా, ప్రాధాన్యం లేకుండా చేయడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


 పార్టీకోసం కష్ట పడిన వారికి టిడిపిలో గుర్తింపు లేదా అనే వ్యాఖ్యలు మొదలయ్యాయి. ముందు ముందు అయినా పీతల కు బాబు న్యాయం చేస్తారో ? అన్యాయం చేస్తారో అనే దానిపైనే పీతల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బాబు అన్యాయమే చేస్తే, అప్పుడు ఆమె వైసీపీలో చేరితే, జగన్ న్యాయం చేస్తాడు అనే నమ్మకం పీతల అనుచరుల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: