తెలుగుదేశం పార్టీ ఎన్టీయార్ స్థాపించారు. ఆయన పద్నాలుగేళ్ల రాజకీయ అనుభవంతో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తరువాత వారసుడిగా అల్లుడు చంద్రబాబు పార్టీ పగ్గాలు అందుకున్నారు. గత పాతికేళ్ళుగా  పార్టీని ఆయన నడిపిస్తున్నారు. చంద్రబాబు సారధ్యంలో అయిదు ఎన్నికలను టీడీపీ ఫేస్ చేసింది, అయితే  అందులో రెండు మాత్రమే ఆయన విజయం సాధించగలిగారు. ఆ రెండూ కూడా పొత్తులు పెట్టుకుని మాత్రమే అని ఇక్కడ  గుర్తు పెట్టుకోవాలి.

ఇక టీడీపీకి నాలుగు పదుల వయసు వచ్చేసింది. చంద్రబాబు ఏడు పదుల వయసులో ఉన్నారు. పార్టీలో బాబు సహచరులు కూడా వయసుమీరిపోయారు. యువరక్తం అంటే వారసులే అన్న అర్ధం వచ్చేలా పార్టీ పదవులను ఇటీవల పంచారు. సరే ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీ పెట్టాక ఇన్నాళ్ళకు ఒక అసాధారణమైన పరిణామం చోటు చేసుకుంది.

అదేంటి అంటే టీడీపీ వారసులను కాకుండా ఒక సాధారణ నాయకుడిని నమ్ముకోవడం. నిజానికి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అంటే అది ఆరవవేలుగానే చూస్తారు. అధినేత చంద్రబాబు, చినబాబు ఇద్దరూ పార్టీని నడిపిస్తూంటే మరో మనిషి అవసరమా అన్న ప్రశ్న కూడా వస్తుంది. కానీ ఇపుడు అచ్చెన్నాయుడు నియామకం అలాంటిది కాదు, ఆయన ఎంత కాదనుకున్నా బీసీల్లో పేరున్న నాయకుడు. నాలుగు దశాబ్దాలుగా ఆయన కుటుంబం కూడా రాజకీయంగా గట్టిగా ఉంది.

దాంతో అచ్చెన్న్నను ఆషామాషీగా తీసేయడానికి వీలులేదు. పైగా అచ్చెన్నాయుడు నియామకంతో పార్టీలోని తమ్ముళ్ళంతా ఇపుడు కొత్త కోరస్ అందుకున్నారు. మీ నాయకత్వంలో టీడీపీ ముందు సాగుతుంది. మీరే మళ్ళీ చంద్రబాబుని సీఎం చేయగలరు అంటున్నారు. అంటే టీడీపీలో అచ్చెన్నను మించిన మొనగాడు లేడు అన్నట్లే కదా. పైగా బీసీ నేత. ఉత్తరాంధ్రాలో టీడీపీకి పట్టు తీసుకువస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రభావం మిగిలిన జిల్లాల మీద పడి టీడీపీకి మంచి రోజులు వస్తాయి. ఈ లెక్కలతోనే బాబు ఆయనకు కిరీటం తొడిగారు. కానీ ఇపుడు టీడీపీలో అచ్చెన్న స్తోత్రాలు ఎక్కువగా వినిపించడం అధినాయకత్వానికి ఏ విధంగా మింగుడు పడుతుందో చూడాలి. ఏది ఏమైనా వారసులను కాదనుకుని బయటవారి ఆసరాతో టీడీపీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితికి వచ్చిందంటే లోపం ఎక్కడుందో తెలుసుకోవాల్సిందేగా.

మరింత సమాచారం తెలుసుకోండి: