దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది కరోనా మహమ్మారి కోణంలో దారుణాలకు పాల్పడుతున్నారు. కరోనాతో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వృద్ధురాలిపై కనీస కనికరం లేకుండా దారుణానికి తెగబడ్డాడో దుర్మార్గుడు. ఆమె ఒంటిపై నగలను కాజేశాడు. అంత్యక్రియల అనంతరం బంగారు ఆభరణాల విషయంపై ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా నగర శివారు కమలానగర్‌కి చెందిన వృద్ధురాలు(78)కి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఈ నెల 5వ తేదీన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అయితే ఆమె పరిస్థితి రోజురోజుకీ విషమించడంతో ఈ నెల 9న ప్రాణాలు కోల్పోయింది. ఆమె కరోనాతో పోరాడి జయించలేక ప్రాణాలు కోల్పోయింది. కోవిడ్ మహమ్మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుందన్న కనీస కనికరం లేని ఆస్పత్రి అటెండర్ గంగరాజు నీచానికి పాల్పడ్డాడు. కరోనాతో మృతి చెందిన వృద్ధురాలి నగలపై కన్నేశాడు ఆస్పత్రి అటెండర్.

ఇక శవాన్ని కూడా వదలకుండా ఒంటిపై ఉన్న సుమారు 63 గ్రాముల బంగారాన్ని కాజేశాడు. తల్లి మరణించడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. అయితే ఆమె ధరించిన బంగారం విషయంపై ఆరా తీయడంతో కనిపించలేదని తేలింది. అనుమానంతో ఆమె కుమారుడు ఆస్పత్రి వర్గాలను ప్రశ్నించాడు. అంతేకాదు అతను స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో ఆసుపత్రి అటెండర్ నగలు మాయం చేసినట్లు తేలింది. గంగరాజును అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: