అసలు ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు...? ఎవరిని అదుపులోకి తీసుకుంటే సమాచారం దొరుకుతుంది. ఎవరిని విచారిస్తే ఏమైనా క్లూ దొరుకుతుంది. ఫోన్ ఎక్కడ నుంచి చేస్తున్నారు...? ఎవరు ఫోన్ చేస్తున్నారు...? వాళ్ళు ఎక్కడ ఉన్నారు...? అసలు కిడ్నాప్ చేసిన బాలుడి ఆరోగ్యం ఏ విధంగా ఉంది...? బాలుడ్ని వాళ్ళు ఏమైనా చేస్తారా...? ఇది ఇప్పుడు మహబూబాబాద్ లో బాలుడి కిడ్నాప్ వ్యవహారం. అసలు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారో తెలియదు ఎవరు చేస్తున్నారో తెలియదు... కనీసం పోలీసు అధికారులకు కూడా ఏ విధమైన క్లూ అనేది ఇప్పటి వరకు దొరకలేదు.

మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ పై మిస్టరీ ఇంకా అలాగే ఉంది. మూడు రోజులుగా కిడ్నాపర్ల చెరలోనే దీక్షిత్ ఉన్నాడు. రాత్రి 8:30 గంటల సమయంలో బాలుడి తల్లికి మరోసారి ఫోన్ చేసిన కిడ్నాపర్... డబ్బులు డిమాండ్ చేసాడు. 45 లక్షలు రెడీ చేసుకోవాలని ఎక్కడికి తీసుకురావాలో నేడు చెప్తా అని కిడ్నాపర్ పేర్కొన్నాడు. అంత డబ్బు లేదని కొంత మొత్తం అరెంజ్ చేస్తామని బాలుడికి హాని తలపెట్టవద్దని  తల్లి వేడుకున్నారు. డబ్బు అరెంజ్ చేయాల్సిందేనని ఫోన్ కట్ చేసాడు సదరు  కిడ్నాపర్.

ఈ వ్యవహారం పోలీస్ లకే సవాల్ గా  మారింది అనే చెప్పాలి. బాలుడి తండ్రి జర్నలిస్ట్ కావడంతో డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్ట్ సంఘాలు... బాలుడి ఆచూకీ గుర్తించాలి అని కోరుతున్నారు. పరిస్థితిపై ఆరా తీసిన డీజీపీ మహేందర్ రెడ్డి... పోలీసులకు పలు సూచనలు చేసారు. కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన స్థానిక బీజేపీ నాయకులు... కేంద్రం సహాయం చేయాలని కోరారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినా కేసులో ఏమాత్రం కూడా క్లూ దొరకలేదు. రంగంలోకి ఐటీకోర్, టాస్క్ఫోర్స్, ఇంటలిజెన్స్, సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలు దిగి కేసుని విచారిస్తున్నాయి. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: