దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య తగ్గుతోంది. కాగా రోజు వారీ కేసుల సంఖ్య 50 వేల కంటే తక్కువగా నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. మున్ముందు వైరస్‌ తీవ్రత మరింత తగ్గే సూచనలున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో మన దగ్గర కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ.. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత రోజు వారీ కేసులు సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వెళ్లింది. ఒకానొక దశలో రోజువారీ కేసుల 96 వేలకు పైగా నమోదవడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. త్వరలో లక్ష దాటొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కానీ.. తర్వాత వైరస్‌ వ్యాప్తి మెల్లగా తగ్గుతూ వస్తోంది.

ముందెన్నడూ లేని రీతిలో.. తొలి సారిగా రోజు వారీ కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు వచ్చింది. అంతేకాదు.. కరోనా వైరస్ బారిన పడి వారి మరణాలు కూడా సగానికి సగం తగ్గాయి. తాజాగా దేశంలో 46 వేల 791 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 587 మంది మరణించారు. ఈ స్థాయిలో రోజువారీ కరోనా కేసులు తగ్గడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. ఇక ముందు కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది.

దేశ వ్యాప్తంగా ఇంత వరకూ 75 లక్షల 97 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీళ్లలో 67 లక్షల 33 వేల మంది పూర్తిగా కోలుకున్నారు. లక్షా 15 వేల 197 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 7 లక్షల 48 వేల యాక్టీవ్‌ కేసులున్నాయి.

దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న అయిదు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రతగా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆ ప్రభావం జాతీయ స్థాయిలో రోజు వారీ కేసుల్లో తగ్గుదలకు దారితీస్తోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలల్లో అంచనాలకు మించిన కరోనా తగ్గుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: