హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల దెబ్బకు ప్రజలు ఎవరూ కూడా రోడ్ల మీదకు రావడం లేదు. ప్రతీ ఒక్కరు కూడా ఇప్పుడు ప్రాణాలతో ఉంటే చాలు అనుకునే విధంగా హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎక్కడో ఒక చోట నష్టం జరుగుతూనే ఉంది. తాజాగా జి హెచ్ ఎం సి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్  ఆధ్వర్యంలో మూసీ పురానాపూల్ కమాన్ వద్ద పూజలు చేసారు.

ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహ్మద్ మహమూద్  అలీ , తలసాని శ్రీనివాస్ యాదవ్, మూసీ రివర్ ఫ్రెంట్ డవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి  కలిసి  "అమ్మవారికి శాంతిపూజ"చేసి,గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పిoచారు.  సమీపంలో వున్న "దర్గా" లో  డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్ "చాదర్" సమర్పించారు. 1908 లో మూసి కి వచ్చిన భారీ వరదతో లక్షలాది మంది నిరాశ్రయులైనారు అని మంత్రులు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అని గుర్తు చేసారు. అప్పటి పండితుల సూచనలు మేరకు "నాటి  నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్"   మూసి కి శాంతి పూజలు చేసి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు అని  వారు వివరించారు. అప్పుడు వరద ఉధృతి తగ్గి మూసి నది శాంతించిందని చరిత్ర అని చెప్పారు. ఇప్పుడు కూడా భారీ వర్షాలు, వరదలు వచ్చినందున అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారికి శాంతి పూజ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు  అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సాధారణ పరిస్థితి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: