అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని, దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ఆర్డర్ అవసరంలేదని స్పష్టంచేసింది. అయితే, తమను ఎన్నికల సంఘం సంప్రదించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతీదానికి రాజ్యాంగ సంస్థ వచ్చి అడగాలా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ విషయాల్లో సహకరించడంలేదో రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడంలేదని కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ఆదేశాలు జారీ చేయాలని నిమ్మగడ్డ హైకోర్టును ఈ సందర్భంలో కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్‌కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.  వెంటనే నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనాన్ని ఎన్నికల కమిషనర్ కోరారు.

ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ  ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను పేర్కొన్నారు. అయితే, ఎన్నికల సంఘానికి రూ.40 లక్షలకు గాను, రూ.39 లక్షల నిధులు విడుదల చేశామని, దీనిపై అదనంగా ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని ప్రభుత్వం వాదించింది. ఏదైనా ఉంటే ప్రభుత్వం తమను సంప్రదించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. కాగా... కరోనా మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించకముందే కరోనాను సాకుగా చూపి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఆ సమయంలో ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య పెద్ద యుద్దమే జరిగింది. నిమ్మగడ్డను తొలగించి ఆ స్థానంలో మరో వ్యక్తిని ప్రభుత్వం నియమించింది. నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లడంతో కోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఆయన మరోమారు తన పదవిలో చేరారు. ఇక ఇప్పుడు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఏప్రిల్ లో నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తికానుంది. ప్రభుత్వం నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి అయిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటోంది. అయితే ఈలోగానే ఎన్నికలు నిర్వహించి తన పంతం నెగ్గించుకోవాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: