లోకల్ బాడీ ఎన్నికలు ఎపుడైనా పెట్టాల్సిందే. ఓ వైపు ఎంతటి కరోనా ఉన్నా కూడా అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకో వైపు దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటైన బీహార్ లో కూడా ఎన్నికలు ఈ నెలాఖరు నుంచి మొదలుకానున్నాయి. ఇక దేశంలో అన్ లాక్ ప్రక్రియ పూర్తి అయింది. అంటే దాదాపుగా అన్ని వ్యవస్థలు మార్చి ముందు మాదిరిగా పనిచేసుకోవచ్చునని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఆయా రాష్ట్రాలు ఇష్టాయిష్టాల బట్టే అవి జరగాలని కూడా పేర్కొంది. దీంతో ఇపుడు మళ్లీ ఫ్లాష్ బ్యాక్ కి అంతా వెళ్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో జరగాల్సినవి అర్ధాంతరంగా ఆగిపోయాయి. దానికి కారణం కరోనా కేసులు. అపుడు ఏపీలో కేవలం ఏడంటే ఏడు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కానీ ఇపుడు చూస్తే రోజుకు మూడు వేల వరకూ నమోదు అవుతున్నాయి. ఓ వైపు కరోనా ఇంకా ఉంది. కానీ నాటికీ నేటికీ తేడా ఏంటి అంటే ప్రజలకు కరోనా మీద అవగాహన బాగా వచ్చింది. భయం కూడా కొంత తగ్గింది.

దాంతో అన్ని వ్యవస్థలు ఎవరి పని వారు చేసుకునేలా కేంద్రం డైరెక్షన్ ఇస్తోంది. ఇపుడు మళ్ళి లోకల్ బాడీ ఎన్నికల మీద చర్చ వస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలు ఇపుడు పెట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిధ్ధంగా ఉంది. ఈ విషయాన్ని హై కోర్టుకు ఒక అఫిడవిట్ రూపంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. దాంతో ఆయనకు సహకరించమని హై కోర్టు సూచించింది.

మరి నిమ్మగడ్డ సారధ్యంలో ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సర్కార్ రెడీనా అంటే కాదు అనే చెప్పాలి. నాడు చెప్పాపెట్టకుండా రద్దు చేసినందుకే జగన్ సర్కార్ కి ఎస్ఈసీకి మధ్య అతి పెద్ద అగాధం ఏర్పడింది. ఇపుడు ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా లేదు. నిమ్మగడ్డ పదవీకాలం అయ్యాకనే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధపడతారు అని కూడా అంటున్నారు.

కానీ ఒకవేళ అనూహ్యంగా  ఎన్నికలు కనుక తోసుకుని వస్తే ఎవరికి లాభం, ఏ పార్టీ గెలుస్తుంది అన్నది ఒక చర్చ. వైసీపీ సంక్షేమ కార్యక్రమాలు బాగా అమలుచేస్తోంది కాబట్టి ఆ పార్టీకి తిరుగు ఉండదని అంటున్నారు మరో వైపు టీడీపీ ఇపుడు ఎంతో కొంత పుంజుకుని ఉంటుంది కాబట్టి   ఆ పార్టీకి కూడా లాభమేనని అంటున్నారు. ఏపీలో ఈ రెండు పార్టీలు తప్ప మిగిలిన పార్టీలకు పెద్దగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రయోజనం కలిగే అవకాశాలు లేవు అని అంటున్నారు. చూడాలి మరి లోకల్ ఫైట్ జరిగితే జనం ఎవరి పక్షమో తేలాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: