భారీవర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అధికారులతో సమీక్ష చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు  హైదరాబాద్‌ వాసులను ఇంకా వాన భయం వీడలేదు. ఇప్పటికే పలు ప్రాంతాల ప్రజలు వరద నీటితోనే సావాసం చేస్తున్నారు.

హైదరాబాద్‌ నగర వాసులను వానభయం వెంటాడుతోంది. పలు ప్రాంతాలు ఇప్పటికీ  జలదిగ్బంధంలో ఉండగా.. మరికొన్ని ప్రాంతాలు వరద మిగిల్చిన బురదతో నానా అవస్థలు పడుతున్నాయి. ప్రధానంగా మీర్‌పేట్ పెద్ద చెరువు తెగితే ప్రమాదమేనన్న హెచ్చరికలతో జనప్రియ వాసులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అపార్ట్‌మెంట్లను వదిలి స్థానికంగా ఉన్న స్కూల్‌లో దలదాచుకుంటున్నారు. జనప్రియ రోడ్లు పెద్ద కాలువనే తలపిస్తున్నాయి.

హబ్సిగూడలోని లక్ష్మీనగర్ కాలనీ ఇంకా వరదనీటిలోనే ఉంది. స్థానికంగా బోట్లు నడుపుతూ సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న వారికి నిత్యాసవరాలు సరఫరా చేస్తున్నారు. వారం రోజులుగా కరెంటు లేక, వరదనీరు బయటకు వెళ్లే వీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ నది.. ప్రవాహ తీవ్రత తగ్గాలంటూ సర్వమత ప్రార్థనలు చేశారు. శాంతించాలని వేడుకుంటూ గంగమ్మ తల్లికి మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు ఉస్మాన్‌ సాగర్‌ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. 1789 అడుగులకు నీటిమట్టం చేరగానే గేట్లు ఎత్తివేస్తామని ప్రకటించారు అధికారులు. దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దిగువ ప్రాంతాల్లో చాటింపు వేశారు.

హైదరాబాద్‌ వరద ప్రభావిత మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ప్రజలు అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేతలు, కార్పొరేటర్లు కూడా పలు కాలనీల్లో పర్యటిస్తున్నారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు ఆర్ధిక సాయం పంపిణీ కూడా కొనసాగుతోంది.  

హైదరాబాద్‌ సహా తెలంగాణలో భారీ వర్షాలు సృష్టించిన బీభత్సంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వందేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురిసాయనీ..  నగరంలోని అన్ని చెరువులు, కట్టల పరిస్థితిని పరిశీలించాలని సూచించిన కేసీఆర్‌... వరదనీటితో ఇబ్బందిపడుతున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: