ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దూకుడు ప్రదర్శించటం మొదలుపెట్టారు. జైలు నుంచి వచ్చాక కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న అచ్చెన్న ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాక, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తనని కావాలనే జైలుకు పంపారనే విషయాన్ని చెబుతూనే, మూడు రాజధానుల విషయంపై కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు.

2019 ఎన్నికల సమయంలో వైసీపీ రాజధానిని మారుస్తామని చెప్పి ఎన్నికలకు దిగలేదని, కాబట్టి ఇప్పుడు మూడు రాజధానుల రెఫరెండంగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని, లేదా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ రాజీనామా చేసి, ఉపఎన్నికలకు వెళ్దామని, అప్పుడు ప్రజలు ఏ తీర్పు ఇస్తే అది ఫాలో అవుదామని సవాల్ విసిరారు. ఇక అచ్చెన్న సవాల్‌లో కూడా ఓ లాజిక్ ఉంది. 2019 ఎన్నికల్లో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని చెప్పి, వైసీపీ ఎన్నికలకు వెళ్లలేదు. కాబట్టి ఇప్పుడు అచ్చెన్న వైసీపీ సవాల్ విసురుతున్నారు.

అయితే అచ్చెన్న సవాల్‌కు మంత్రి సీదిరి అప్పలరాజు అదిరిపోయే ప్రతి సవాల్ విసిరారు. మూడు రాజధానుల విషయంలో సవాల్‌లు ఎందుకని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని రాజీనామా చేయమని చెప్పాలని, అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తే వైసీపీ పోటీకి దిగుతుందని, తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. రాష్ట్రాన్ని సాధించుకున్నారని మంత్రి అప్పలరాజు గుర్తు చేస్తున్నారు.

వాస్తవానికి అప్పలరాజు కూడా అదిరిపోయింది. ఎందుకంటే తెలంగాణ సాధించుకోవడం కోసం, అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లారు. అందులో గెలిచారు. అందుకే ఇప్పుడు అమరావతి కోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిస్తే పరిస్తితి వేరుగా ఉంటుంది. అప్పుడు ప్రజలు అమరావతి కోరుకుంటున్నారని అర్ధమవుతుంది. లేదంటే మూడు రాజధానులకే మద్ధతు ఉందని తెలుస్తోంది. కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే మూడు రాజధానుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. మరి చూడాలి మంత్రి సవాల్‌పై అచ్చెన్న ఎలా స్పందిస్తారో.  

మరింత సమాచారం తెలుసుకోండి: