అమరావతి...ఏపీ రాజధాని. రాష్ట్రం విడిపోయాక కొత్తగా ఏర్పడిన ఏపీకి రాజధాని లేదు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడంతో, ఏపీకి రాజధాని కావాల్సి వచ్చింది. అయితే అప్పుడు 2014లో జరిగిన ఎన్నికల్లో జనం అనుభవం గల నేత అని చెప్పి చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అయితే అనుభవం ఉన్న చంద్రబాబుకు రాజధాని నిర్మించే మంచి అవకాశం దక్కింది.

ఇక బాబు అధికారంలోకి వచ్చాక పలు రకాల సలహాలు, సూచనలతో రాష్ట్రం మధ్యలో ఉంటుందని, నీరు కూడా అందుబాటులో ఉంటుందని, భూములు కూడా మంచివని చెప్పి కృష్ణా, గుంటూరు జిల్లాలకు మధ్యలో ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే 29 గ్రామాల్లో భూ సమీకరణ పేరిట 33 వేల ఎకరాలని రాజధాని కోసం తీసుకున్నారు. అలాగే అందులో కొంత భూమిని అభివృద్ధి చేసి రైతులకు ఇస్తామని కూడా చెప్పారు.

అటు కేంద్రంలో బీజేపీతో కలిసి ఉండటంతో రాజధాని ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ కూడా అమరావతికి మద్ధతు ఇచ్చారు. ఈ క్రమంలోనే సరిగ్గా ఐదు సంవత్సరాలు అంటే ఏపీ రాజధానిగా అమరావతికి 2015 అక్టోబర్ 22న (విజయదశమి) మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చంద్రబాబు తాత్కాలిక భవనాలు అంటూ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులని కట్టారు.
అలాగే ఇంకా పెద్ద గ్రాఫిక్స్ కూడా చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు బాబుని చిత్తుగా ఓడించి, జగన్‌ని గెలిపించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన వికేంద్రీకరణ కొరకు 2020 జులై 31న అమరావతిని కేవలం శాసనసభ రాజధానిగా పరిమితం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత రైతులు ఉద్యమిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా ముందుకెళుతుంది. అటు అమరావతికి శంఖుస్థాపన రాయి వేసిన మోదీ కూడా దీని గురించి వదిలేసినట్లు కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మద్ధతు తెలుపుతారని తెలుస్తోంది. దీని బట్టి చూసుకుంటే అమరావతి కథ కంచికి వెళ్ళినట్లే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: