వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకుడు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. మరి ఈయన ప్లాన్ ఏంటో ఎవరికి తెలియదు గానీ, జనం మద్ధతు ఉన్న జగన్‌ని వదిలేసి, జనం మద్ధతు లేని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. చాలా రోజుల నుంచి జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్‌పై విమర్శలు చేయడం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ అయి ఉండి ఢిల్లీలో ఉంటూ, రచ్చబండ పేరిట జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక ఈయన రోజూ ఇదే పనిలో ఉంటున్నారు. అయితే రాజుగారు ఓ పక్కా వ్యూహంతోనే జగన్‌ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. లేదంటే అంత జన బలం ఉన్న జగన్‌ని వ్యతిరేకించాల్సిన అవసరం రాజుగారికి లేదు. అధికారాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.


కానీ రాజుగారు అలా చేయకుండా జగన్‌పైనే రివర్స్ అవుతున్నారంటే ఏదో ప్లాన్ ఉందనే అర్ధమవుతుంది. పక్కాగా జగన్‌ని నెగిటివ్ చేయడమే లక్ష్యంగా రాజుగారు ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే రాజుగారు పదే పదే జగన్ కులం, మతం ప్రస్తావన తెస్తున్నారు. అందుకే జగన్ తన ప్రభుత్వంలో రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీఠ వేస్తున్నారని, అలాగే తన మతం క్రిస్టియానిటీని రాష్ట్రంలో పెరిగేలా చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.


తాజాగా కూడా రాజుగారు అదే పనిలో పడ్డారు. 1.8 శాతం ఉన్న క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతపై.. విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని ప్రధానిని కోరానని మాట్లాడారు. ఒక మతాన్ని పోత్సహిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని, హిందూ స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించాలని, రామరాజ్యాన్ని క్రైస్తవ రాజ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే రాజుగారు ఈ విమర్శలన్నీ ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని తెలుస్తోంది. జగన్‌ని జనంలో నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో జగన్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. మరి చూడాలి రాజుగారు రాజకీయం ఎంతవరకు సాగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: