దసరా.. తెలుగు వాళ్లకు అతి పెద్ద పండుగల్లో ఒకటి. ఈ పండుగకు హైదరాబాద్ నుంచి భారీగానే సొంత ఊళ్లకు జనం వెళ్తారు. అలా వెళ్లేవాళ్లలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలిసిందే. కానీ.. ఈసారి మాత్రం అలా వెళ్లే వారికి తగిన వసతులు లేక చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం.. ఆంధ్ర, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నడవకపోవడమే.  కరోనా టైమ్‌ నుంచి ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడవటం లేదు. కరోనా తగ్గినా... కేంద్రం ఓకే చెప్పినా తెలంగాణ మాత్రం ఆంధ్ర బస్సులకు నో ఎంట్రీ అంటున్నారు.

అందుకు ప్రధాన కారణం.. ఏ స్టేట్ సర్వీసులు.. ఎన్ని తిరగాలన్నదానిపై ఓ క్లారిటీ రాకపోవడమే. ఈ విషయంలో ఏపీ సర్కారు ఒకింత తగ్గి వస్తున్నా తెలంగాణ మాత్రం పట్టువిడువడం లేదు. మొత్తానికి ఈ పండక్కి ఏపీకి హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ఇష్యూ ఆధారంగా అటు జగన్‌ను, ఇటు కేసీఆర్‌ను ఇద్దరిపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. దసరాకి తెలంగాణ నుంచి ఆర్టీసీ బస్సులు నడపలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని జనసేన మండిపడుతోంది.

స్వస్థలాలకు రాలేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని విమర్శిస్తోంది. కనీసం దసరా నాటికైనా బస్సులు తిరిగితే సొంత ఊళ్ళకు రావాలనుకొన్నవారికి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నిరాశ కలిగించిందని మండిపడుతున్నారు. అలాగే వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళాలి అనుకొన్నవారికి రవాణా సదుపాయంలేకుండాపోయిందని... తమకు కావల్సినవారికి అత్యవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలించే ప్రభుత్వం  పేదల కోసం బస్సులు నడపలేకపోతోందని విమర్శిస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందంటున్న జనసేన.. లాక్డౌన్ కి ముందు రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 1281 బస్సులు నడిచేవని.. ఇప్పుడు ఒక్క బస్సు కూడా తిరగటం లేదని గుర్తు చేస్తున్నారు. రైల్వే సేవలూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేని ఈ సమయంలో ఆర్టీసీ బస్సులు ప్రజలకు అందుబాటులో ఉంచితే ప్రయోజనకరంగా ఉండేదని.. కానీ జగన్, కేసీఆర్ ఈ విషయం పట్టించుకోవడం లేదని జనసేన మండిపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: