మూడు రాజధానుల బిల్లు చట్టరూపం పొందినా.. కోర్టులో విచారణ కొనసాగుతుండటంతో.. అధికారికంగా ఎలాంటి కార్యకలాపాలు ముందుకు సాగడంలేదు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు మరో అడుగు ముందుకేసి, విశాఖ పట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ ని పట్టాలమీదకు తెస్తోంది. దీనికి సంబంధించి పనులన్నీ చకచకా పూర్తి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. విశాఖ మెట్రోపై సీఎం జగన్ ఇప్పటికే సంబంధిత మంత్రులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 2020లోగా విశాఖలో మెట్రో పరుగులు తీయాలని ఆయన డెడ్ లైన్ పెట్టారు.
సీఎం ఆదేశాలతో.. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌ (సమగ్ర నివేదిక) వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని మెట్రో రైలు కార్యాలయంలో అధికారులతో  సమీక్ష నిర్వహించారు. విశాఖ మెట్రో రైలుకి సంబంధించి భూ సేకరణ, తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ మార్గాలను కూడా డీపీఆర్‌లో పొందుపర్చాలని అధికారులకు స్పష్టం చేశారు.
కోవిడ్‌ కారణంగా డీపీఆర్‌ రూపకల్పన ఆలస్యమైందని, త్వరలోనే దీనికి తుదిరూపు ఇస్తామని అధికారులు మంత్రి బొత్సకు తెలిపారు. విశాఖ  నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ఏయే మార్గాల్లో మెట్రో రైలు ఏర్పాటుకు అవకాశాలున్నాయనే దానిపై చర్చించారు. 75 కిలోమీటర్ల మేర నిర్మించే కారిడార్లలో ప్రజలకు సౌకర్యవంతంగా స్టేషన్లు, నిర్వహణ సౌలభ్యం తదితర విషయాల్లో  మరింత అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. తుది అంచనాలకు వచ్చే ముందు అవసరమనుకుంటే మరోసారి క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు. అత్యుత్తమ ప్రమాణాలతో విశాఖ మెట్రో రైల్‌ ఉండేలా ప్రణాళికను రూపొందించాలన్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కుతుంది. తిరిగి ఎన్నికలకు పోయేనాటికి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు జగన్. అదే జరిగితే.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు మెట్రో ఓ మణిహారంగా మారుతుందనడంలో సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: