ఉల్లిరేటు క్రమక్రమంగా 100 రూపాయలకు చేరుకుంటున్న వేళ.. ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిపాయల్ని అమ్మేందుకు ముందుకొచ్చింది. వినియోగదారుల కష్టాలు తీర్చేందుకు గత ఏడాది లాగే ఈ సారి కూడా రైతు బజార్లలో ఉల్లిపాయల్ని సబ్సిడీ రేటుకు అమ్మేందుకు సిద్ధమైంది. తొలి దశలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లలో శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు విక్రయిస్తారు. అయితే కొవిడ్ నేపథ్యంలో.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ.. ఉల్లిపాయల్ని అమ్మబోతున్నారు అధికారులు.
దేశవ్యాప్తంగా అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. రిటైల్‌ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఇతర దేశాలనుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది. ఉల్లికి డిమాండ్ తగ్గిపోతే అటోమేటిక్ గా రేటు తగ్గిపోతుందని, అందుకే ఎక్కువ మోతాదులో ఉల్లిని దిగుమతి చేసుకుంటామని అంటున్నారు అధికారులు.

ఇక రాష్ట్రంలో కర్నూలు, తాడేపల్లిగూడెం హోల్‌ సేల్‌ మార్కెట్లలో ఉల్లిపాయలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మార్కెట్‌లలో రేటు ఎలా ఉన్నా.. ప్రభుత్వం అదే ధరకు కొనుగోలు చేసి, రైతుబజార్లలో కిలో రూ.40కి అమ్మాలని నిర్ణయించింది. తొలి దశలో రాష్ట్రంలోని నగరాలు, ముఖ్య పట్టాణాల్లోని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి అందుబాటులో ఉంచాలని భావిస్తున్నా.. రెండోదశలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్‌ తెలియజేశారు. అయితే ఒక్కొకరికి ఎన్ని కేజీలు అమ్ముతారు, ఆధార్ కార్డ్ వివరాలు చెప్పాల్సి ఉంటుందా.. అనే విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.  ఉల్లిపాయల రేటు మాత్రం కేజీ 40రూపాయలుగా నిర్థారించారు. గత ఏడాది అమ్మిన రేటు కంటే ఇది అధికం కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: