ఇటీవల కాలంలో రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి మీ నియోజకవర్గాలకు నిధులిస్తాం.. ముందుగా కాషన్ డిపాజిట్ కింద కొంత సొమ్ము ఇవ్వండి అంటూ కొంతమంది ఫేక్ కాల్స్ తో మోసాలకు తెగబడటం చూశాం. మహిళా ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ ఇలాంటి వైట్ కాలర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. అయితే నేతలంతా తెలివిగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి పప్పులు ఉడకలేదు. ఇప్పుడు మరోసారి అలాంటి ఉదంతమే బైటపడింది. అయితే ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లం పేరు వాడుకోవడం మరీ విచిత్రం. అజేయకల్లం పేరుతో కొంతమంది ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు తెగబడినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా అజేయకల్లం స్వయంగా ఏపీ డీజీపీని కోరారు.
మంగళగిరి ప్రాంతానికి చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు వాట్సాప్‌ పోస్టుల ద్వారా తన దృష్టికి వచ్చిందని అజేయకల్లం పేర్కొన్నారు. ఈమేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ జరిపించాల్సిందిగా కోరారు. తన పేరుతో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేశారని వాట్సప్ పోస్ట్ లలో వార్తలొస్తున్నాయని, ఒకవేళ నిజంగా ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడ్డారా లేక, అసలు ఆ వాట్సప్ లో వచ్చినవే తప్పుడు పోస్ట్ లా అనే విషయంపై ఆరా తీయాలని కోరారు.

వాట్సప్ పోస్ట్ ల ద్వారా వచ్చిన విషయాలపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కలసి విజ్ఞప్తి చేశారు అజేయ కల్లం. విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే.. వాట్సాప్‌ మెసేజ్‌లపై దృష్టిపెట్టాలని సూచించారు. అసలు వాట్సప్ పోస్ట్ ల ద్వారా ఎవరు ఇలాంటి ప్రచారానికి తెరతీశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఈ పని చేస్తున్నారా అనే విషయాలపై విచారణ జరపాలన్నారు. వాట్సప్ మెసేజ్ లకు కారకులెవరో గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: