ఆ మధ్య వచ్చిన భరత్ అనే నేను.. సినిమా చూశారుగా... అందులో మహేశ్ బాబు అనుకోకుండా సీఎం అవుతాడు.. అప్పటి వరకూ విదేశాల్లో ఉండి వచ్చిన మహేశ్ బాబుకు ఇక్కడి జనం క్రమ శిక్షణ లేకపోవడం అస్సలు నచ్చదు. అందుకే రోడ్లపై అడ్డగోలుగా తిరిగే ప్రజలకు భారీ ఫైన్లతో షాక్ ఇస్తాడు.. దాంతో జనం మొదట తిట్టుకున్నా చివరకు దారికొస్తారు.. జగన్ సీఎం కాగానే భరత్ అనే నేను టైటిల్‌ ను జగన్ అనే నేను అంటూ చాలా మంది ఫ్యాన్స్ పేరడీ చేశారు.

ఇప్పుడు జగన్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి జగన్ సర్కారు భారీగా ఫైన్లు పెంచింది. జనాలను దారిలో పెట్టేలా  ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు ఏకంగా రూ.10000 జరిమానా..  రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు రూపాయలు క‌ట్టాల్సిందే. అదే నేరానికి మరోసారి దొరికిపోతే.. రెండోసారికి రూ.10 వేల జరిమానా విధించారు.

అలాగే రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు ఫైన్.. అదే నేరంపై  రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు రూపాయల ఫైన్‌..  ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు జరిమానాగా నిర్ణయించారు.  ఇలా ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఫైన్లతో బాదేశారు. మరి ఇలా ఫైన్లు పెంచితే సినిమాలో జనం దారికొస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

అయితే.. ఇదంతా  కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరి సూచనల మేరకే జరిగిందన్న వాదన కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం కనక దుర్గమ్మ ప్లై ఓవర్ ఆరంబోత్సవ సభలో ఆయన ఇలాంటి సూచనలు చేశారట. తమిళనాడు తరహా విధానం అమలు చేయాలని ఆయన కోరారట. దాని ఫలితమే ఈ జరిమానాల దెబ్బ అంటున్నారు. ఏదేమైనా జగన్ మాత్రం భారీ షాకే ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: