ఇటీవల కొంతకాలంగా భారత్, చైనాల మధ్య సరిహద్దుల వెంబడి పలు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనడం తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దు దాటి అవతలి దేశ హద్దుల్లోకి ఎవరైనా వెళితే ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేది ఊహించొచ్చు‌. కానీ భారత్ మాత్రం అలాంటి పరిస్థితుల్లో కూడా తన నిబద్ధతను చాటుకుంది. వివరాల్లోకి వెళితే భారత్, చైనాల వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా పీపుల్స్ ఆర్మీకి చెందిన ఒక సైనికుడిని భారత్‌ తిరిగి వారికి క్షేమంగా అప్పగించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రోటోకాల్‌ ప్రకారం బుధవారం చుషూల్‌-మోల్దో మీటింగ్‌ పాయింట్‌ వద్ద అయన్ని చైనా బలగాలకు అప్పగించినట్లు పేర్కొంది. సైనికుడిని తిరిగి విధుల్లోకి చేర్చుకునే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

చైనా, తమ జవాన్‌ను తమకు అప్పగించాలంటూ మంగళవారమే భారత్‌కు విజ్ఞప్తి చేసింది. తప్పిపోయిన తన జడల బర్రెను వెతికిపెట్టాలన్న ఒక స్థానికుడి విజ్ఞప్తి మేరకు ఆ జవాన్ ఆ జడల బర్రెను వెెెతికే క్రమంలో పొరపాటున సరిహద్దు దాటడం జరిగింది. దీంతో సరిహద్దు దాటిన ఆ చైనా సైనికుడిని ఇండియన్ ఆర్మీ సోమవారం దేమ్‌చోక్ సెక్టార్ వద్ద అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా షీజియాంగ్ ప్రావిన్సుల్లోని షాగ్జింజన్ పట్టణానికి చెందిన పీఎల్ఏ‌కు చెందిన సైనికుడు వాంగ్ యా లాంగ్‌గా గుర్తించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రోటోకాల్‌ను అనుసరించి తిరిగి చైనాకు అప్పగిస్తామని భారత్ హామీ ఇచ్చింది. హామీకి కట్టుబడి భారత సైన్యం చెప్పినట్టుగానే అతడిని చైనా ఆర్మీకి తిరిగి అప్పగించింది. తూర్పు లడఖ్‌ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: