అమరావతి రాజధాని. ఇది గత  చాలా కాలంగా వింటున్న మాట. ఈ రోజు అమరావతి రాజధానికి శంఖుస్థాపన అయి అచ్చంగా అయిదేళ్ళు నిండిపోయాయి. ఈ దేశంలో కొత్త రాష్ట్రాలు అనేకం ఏర్పడ్డాయి. కానీ ఎక్కడా రాజధాని విషయంలో ఇంత రచ్చ లేదు. పైగా అక్కడ రాజధాని విషయంలో ఇంత బిల్డప్ కూడా లేదు. రాజధాని అంటే కేవలం పాలనా కేంద్రం అన్నట్లుగానే అంతా భావించారు కాబట్టి వివాదాలేమీ తలెత్తలేదు.

కానీ అమరావతి రాజధాని  అలా కాదు, హైదరాబాద్ చూసి మరో మోడల్ గా తయారుచేయాలనుకున్నారు. చేతిలో అధికారం ఉంది ఎలా చేసిన ఫరవాలేదు అని తెలుగుదేశం హయాంలో పెద్దలు చేసిన పనికి ఇపుడు అయిదు కోట్ల మంది జనం మూల్యం చెల్లిస్తున్నారు. ఏపీ విభజన తరువాత దాదాపుగా తొంబై వేల కోట్ల అప్పుతో ఏర్పడింది. ఇక ఏపీలో ఒక్క విశాఖ విజయవాడ తప్ప పెద్ద సిటీలు లేవు. ఆదాయవనరులు లేవు, వ్యవసాయం మీదనే ఆధారపడాలి.

కేంద్ర సాయం అంతకంటే లేదు. ఈ స్థితిలో నిధులు  ఉన్నంతలో పాలనా భవనాల కోసం ప్రభుత్వ స్థలాల్లొ  రాజధానిని శక్తి కొలది కట్టుకుంటే పోయేది. దానికి నాటి సీఎం చంద్రబాబు చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు, ప్రపంచ రాజధాని అన్నారు. అసలు అంత రాజధాని ఎందుకో బాబు ఈ రోజుకైనా చెప్పగలరా. ప్రపంచ రాజధాని అన్న బాబు నిధులు ఎలా వస్తాయో చెప్పగలిశారా.

సింగపూర్ తో ఒప్పందం లోపభూయిష్టం, ఏకపక్షం. అలాగే అమరావతి పేరిట డిజైన్లు కూడా కూడా కామెడీ అయ్యాయి. ఏ దేశం వెళ్తే ఆ దేశంలా అమరావతిని చేస్తాను అనుకుంటూ పుణ్యకాలం గడిపేశారు. శివరామక్రిష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కారు. పచ్చని పొలాలను తీసుకోవద్దు, పాడుపెట్టవద్దు, పర్యావరణానికి విరుద్ధం అని చెప్పినా వినలేదు. అసలు నగరాలు నిర్మించిన చరిత్ర మానవ జాతి పుట్టాక ఎక్కడైనా ఉందా. నగరాలు వాటంతట అవే రూపుదిద్దుకోవాలి. ఇపుడు మెగా సిటీస్ అన్నీ అలా తయారైనవే.


కానీ అమరావతి పేరిట పెద్ద పరుగులు తీసి చంద్రబాబు టీడీపీ చరిత్రలోనే అతి పెద్ద తప్పు చేశారు. దానికి మూల్యం ఈ రోజు ఏపీ జనం మొత్తం చెల్లిస్తున్నారు.  చంద్రబాబు అమరావతి లోని తొలి దశలో  ప్రాజెక్టుల కోసం ప్రతిపాదించిన మొత్తం 55 వేల కోట్లు. ఇక అమరావతి వంటి రాజధాని తయారు  కావాలంటే నాలుగు నుంచి అయిదు లక్షల ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. అవి పూర్తి కావడానికి  ఎంత కాలం పడుతుంది. అపుడు ఎవరు రాజు, ఎవరు మంత్రి. ఇవన్నీ కామన్ సెన్స్ పాయింట్లు. కానీ బాబు అతికి పోయారు. చివరికి అక్కడ రైతులను ఎటూ కాకుండా చేశారు. దాని ఫలితమే ఇపుడు అమరావతి పేరిట నిరసనలు చేస్తున్నా  మొత్తం ఏపీ జనం మద్దతు కరవు కావడం. ఇకనైనా టీడీపీ పెద్దలు పునరాలోచన చేయాలి. ఏపీలో ఏం చేస్తే బాగుంటుందో నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలి  అన్నింటి కంటే ముందు కలల విహారం ఆపాలి.
 




మరింత సమాచారం తెలుసుకోండి: