మోడీ రాజకీయ బాహుబలి. ఒక్క చేత్తో ఎందరినో కొట్టగల సమర్ధుడు. ఎన్నో ఎన్నికల్లో విజేతగా నిలిచిన యోధుడు. గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ప్రధానిగా అలుపెరగని సేవలో దేశానికే అంకితం అయిన నేత. అటువంటి మోడీ అంటే 135 కోట్ల మంది జనాలు ఉన్న భారతదేశంలో మెజారిటీ జనాలకు ఇష్టం. వారి అలా ఇష్టపడబట్టే కదా ఆయన రెండవసారి 303 సీట్లతో అధికారంలోకి వచ్చారు. మరి మోడీ పక్కన అమిత్ షా ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన మోడీ కుడిభుజం. వ్యూహకర్త. అపర చాణక్యుడు. మరి ఈ ఇద్దరి కాంబో ఎన్నో విజయాలు అందుకుంది. కానీ ఈ ఇద్దరూ అంటే ఇపుడు ఎన్డీయే కూటమి లోని మిత్రులకు  ఎందుకో ఇష్టం ఉండడంలేదు అంటున్నారు.

నిజానికి జాతీయ ప్రజాస్వామ్య‌ కూటమి పేరిట రెండు దశాబ్దాల   క్రితం బీజేపీలో సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయి స్థాపించారు. నాడు 23 పార్టీలతో కలసి అధికారం పంచుకున్న ఘనత వాజ్ పేయిది. ఇక ఆ కూటమి ఇపుడు మోడీ చేతుల్లోకి వచ్చాక సగానికి సగం తగ్గిపోయింది. ఇపుడు చూస్తే మోడీ రెండవ సారి అధికారంలోకి వచ్చాక చిక్కి శల్యమైపోతోంది. ఆ కూటమి నుంచి బలమైన పార్టీలు, సుదీర్ఘకాలం బీజేపీతో చెలిమి చేస్తున్న స్నేహితులు  తప్పుకుంటున్నారు.

గత నెల రోజుల తేడాలో మూడు పార్టీలు కూటమి నుంచి వేరు పడ్డాయి. మరి దీనికి కారణం మోడీ షా ఇద్దరూ ఆలోచించుకోవాల్సిందేగా. వరసగా శిరోమణీ అకాలీదళ్, రామ్ విలాస్ పాశ్వాన్  లోక్ జన శక్తి, గూర్ఖా జన్ ముక్తి మోర్చా  ఎన్డీయేకి గుడ్ బై కొట్టేశాయి. దీనికంటే ముందు గత ఏడాది శివసేన కూడా మోడీకి, షాలకు రాం రాం అనేసింది. మరి ఇంతలా పార్టీలు జట్టు వీడుతున్నాయంటే అది సీరియస్ మ్యాటరే. ఒక విధంగా అన్ని పార్టీలను కలుపుకుని పోయే నైజం కేంద్ర పెద్దలకు లేదా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా 2024 ఎన్నికలు క్యాట్ వాక్ గా ఎవరికీ ఉండవు. మిత్రులను ఇప్పటి నుంచే కూడగట్టుకోకపోతే మోడీ షాల వ్యూహాలు ఎన్ని ఉన్నా అతి పెద్ద దెబ్బ పడిపోతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: