అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో స్థానికుల మద్దతు కూడగట్టే క్రమంలో హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా కంపెనీలు ముఖ్యంగా ఐటీ పరిశ్రమల్లో నైపుణ్యం కలిగి విదేశీ ఉద్యోగులను అరికట్టే నిబంధనలను ట్రంప్ యంత్రాంగం బుధవారం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన నిరుద్యోగం మధ్య అమెరికన్ల ఉద్యోగాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. అమెరికా కార్మిక శాఖ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సంయుక్తంగా ఈ నిబంధనలను ప్రకటించాయి.

తాజా నిబంధన ప్రకారం హెచ్ -1బీ వీసా కింద చేరిన ఉద్యోగులకు కంపెనీలు చెల్లించాల్సిన కనీస వేతనాలు గణనీయంగా పెరుగుతాయి. అంతే, వీసా అర్హత కలిగిన ‘ప్రత్యేక వృత్తులు’ నిర్వచనాన్ని కూడా మార్చుతుంది. డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనపై వాణిజ్య వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ తప్పనిసరని, ఎందుకంటే అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉందని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాఖ్యానించింది. మొత్తం హెచ్-1బీ వీసాదారుల్లో మూడింట రెండొంతుల మంది భారతీయులే కాగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఐటీ కంపెనీల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాత్కాలిక డైరెక్టర్ కెన్నెత్ కకినెల్లీ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా కంపెనీలకు ఉద్యోగులను సరఫరా చేసే కాంట్రాక్టర్లు వీసా పొందకుండా కొత్త నిబంధనలు మరింత కఠినతరం చేశామని తెలిపారు. ప్రస్తుత నిబంధనల్లో ఉన్న లోపాలను కాంట్రాక్టర్లు అనుకూలంగా మలచుకుని, హెచ్-1బీ వీసాదారులను తక్కువ వేతనాలకే అమెరికా సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారని అన్నారు.

అమెరికన్లను నియమించకుండా ఉండటానికి లేదా వారి ఎక్కువ వేతనాలు పొందే అమెరికన్లను తొలగించి, తక్కువ మొత్తానికే విదేశీయులను నియమించుకునే విధానాన్ని సంస్థలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ ఏడాది డిసెంబరు వరకు హెచ్-1బీ వీసాలపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ జూన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించాయి.అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ హయాంలో హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ రూపకల్పన చేశారు. ఐటీ సెక్టార్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో నిపుణులైన విదేశీయులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని కొనసాగించాలని వ్యాపార, వాణిజ్య సంస్థలు బలంగా కోరుకుంటున్నాయి. దీనిని వ్యతిరేకించేవారు మాత్రం పరిమితులు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, మద్దతుదారులు మాత్రం H-1B వీసాదారులు క్లిష్టమైన అవసరాలను తీరుస్తారని, అమెరికన్ల నుంచి ఉద్యోగాలు లాగేసుకోవడం లేదని వాదిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి, మరిన్ని అవకాశాలను సృష్టించడానికి సహాయపడతారని అంటున్నారు.
ఐటీ, లైఫ్ సైన్సెస్, ఆరోగ్య భద్రత తదితర విభాగాల్లో ఏటా మొత్తం 85,000 హెచ్-1బీ వీసాలను అమెరికా జారీచేస్తోంది. సాధారణంగా మూడేళ్ల కాలపరిమితితో జారీచేసి, తర్వాత పునరుద్ధరిస్తారు. ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన వెంటనే కార్మిక శాఖ నిబంధనలు అమలులోకి వస్తాయని, హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వచ్చే వాటిపై ప్రజాభిప్రాయం తర్వాత అమలుచేస్తామని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: