హైదరాబాద్ లో భారీ వరదల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ బృందం పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. చాంద్రాయణ గుట్ట ఫ‌ల‌క్‌నూమా వద్ద దెబ్బతిన్న  ఆర్.ఓ.బి ని, ముంపుకు గురైన  ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించి అక్కడి బాధితులను కూడా కలిసింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం టీం లీడర్ ప్రవీణ్ వశిష్ఠ, అధికారులు ఎం.రఘురామ్, ఎస్ కె కుష్వారా మాట్లాడారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్ ఓ బి.కి రెండు వైపుల చేప‌ట్టిన‌  పునరుద్దరణ, నాలా నుండి తొలగిస్తున్న పూడిక తీత పనులను కేంద్ర ప్రభుత్వ అధికారులు పరిశీలించారు.

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో త‌మ ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొద‌టి అంత‌స్తులోకి కూడా నీళ్లు వ‌చ్చిన‌ట్లు ఈ ప్రాంత ప్ర‌జ‌లు కేంద్ర క‌మిటి దృష్టికి తీసుకు వెళ్ళారు. ఇప్ప‌టికి రోడ్ల‌పై, ఇళ్ల‌లోనూ నీళ్లు పేరుకుపోయి ఉన్న‌ట్లు వారు వివరించారు. 10 రోజుల పాటు నీళ్ల‌లో నాన‌డం ప‌ట్ల త‌మ ఇళ్ల గోడ‌లు దెబ్బ‌తిన్నాయ‌ని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సంద‌ర్భంగా జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డిఎస్‌ లోకేష్ కుమార్‌, చీఫ్ ఇంజ‌నీర్ జియా ఉద్దీన్ లు మాట్లాడుతూ 40 సంవ‌త్స‌రాల క్రితం ఫ‌ల‌క్‌ నూమా ఆర్‌.ఓ.బి ని నిర్మించిన‌ట్లు  వివరించారు.

ఈ ఆర్‌.ఓ.బి వ‌ల‌న ఇన్న‌ర్ రింగ్‌రోడ్డు, చార్మినార్ ప్రాంతాల‌కు రోడ్డు స‌దుపాయం అనుసంధానం అయిన‌ట్లు వివరించారు. పల్లె చెరువు నుండి వ‌చ్చే వ‌ర‌ద నీటి నాలా 7 మీట‌ర్ల వెడ‌ల్పు ఉంటుంద‌ని, అది ఆర్‌.ఓ.బి కింద నుండి వెళ్తుంద‌ని వారు పేర్కొన్నారు. ప‌ల్లె చెరువు తెగిపోవ‌డం వ‌ల‌న వ‌చ్చిన వ‌ర‌ద‌తో ఈ ప్రాంతానికి అపార న‌ష్టం జ‌రిగిన‌ట్లు వారి దృష్టికి తీసుకుని వెళ్ళారు. రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి ఆర్‌.ఓ.బి రిటైనింగ్ వాల్వ్ దెబ్బ‌తిన్న‌ద‌ని, అదే విధంగా అనేక కాల‌నీలు వ‌ర‌ద ముంపుకు గురైన‌ట్లు  వారు పేర్కొన్నారు. రోడ్ల‌పై 5 మీట‌ర్ల ఎత్తున వ‌ర‌ద నీరు నిలిచిన‌ట్లు కేంద్ర బృందానికి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: