కరోనా నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అప్పటికే ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబు వారాంతంలో హైదరాబాద్‌కు వెళుతూ ఉండేవారు. కానీ కరోనా వచ్చాక అయితే పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైపోయారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి చూసే వెళ్లారే తప్పా, ఏపీ ప్రజలు గురించి పెద్దగా పట్టించుకోలేదు. అలాగే బాబు తనయుడు లోకేష్ సైతం హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. దీంతో ఏపీలో టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది.

ఏపీకి వచ్చి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయకుండా, హైదరాబాద్‌లోనే ఉంటూ మీడియా, సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కూర్చున్నారు. ఈ క్రమంలోనే అధినేత హైదరాబాద్‌కే పరిమితం కావడంతో తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. దీంతో చంద్రబాబు, చినబాబుని ఏపీకి పంపించారు. ఇటీవల వరదల వల్ల రాష్ట్రంలో వేల ఎకరాల పంట నష్టం జరిగింది.

ఈ క్రమంలో చినబాబు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, వరద నీటిలో దిగి మరీ రైతులని పరామర్శిస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్ళు ఎక్కడా ఆగడం లేదు. అదిగో మా చినబాబు ఫీల్డ్‌లోకి దిగితే పరిస్థితి వేరేగా ఉంటుందని హడావిడి చేసేస్తున్నారు. అసలు జగన్ హెలికాప్టర్‌లోనే తిరుగుతున్నారు గానీ, నేలపైకి వచ్చి రైతులని పరామర్శించడం లేదని విమర్శలు చేస్తున్నారు. జగన్ కంటే మా చినబాబు తోపు అన్నట్లు తమ్ముళ్ళు డప్పు వాయిస్తున్నారు.

అయితే తమ్ముళ్ళ మాటల ప్రకారం చినబాబు ఫీల్డ్‌లోకి అదరగొట్టేస్తున్నారని, కానీ జనం మాటల ప్రకారం చినబాబు వరదలో బురద రాజకీయం చేస్తున్నట్లు అని వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. చినబాబు ఎంత వరదలో తిరిగినా జనం నమ్మడం లేదని, చినబాబు దగ్గర రియాలిటీ లేదని అనుకుంటున్నారని చెబుతున్నారు. పైగా పొలాల్లో కూడా కెమెరామెన్‌లు వేసుకుని చినబాబు చేసే నటన మామూలుది కాదని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికైతే చినబాబు ఫీల్డ్‌లోకి దిగి, జనంలో చులకన అయ్యారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: