బీహార్‌ రాజకీయం వేడెక్కింది. ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి... ప్రధాన పార్టీలు. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేయగా... ఇప్పుడు ఆ లిస్ట్‌లో బీజేపీ చేరింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రతి ఒక్కరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొంది బీజేపీ. మరోవైపు రేపటి నుంచి మోడీ, రాహుల్‌ ప్రచార పర్వంలోకి దిగనున్నారు.

బీహార్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్డీయే-జేడీయూ కూటమి, కాంగ్రెస్‌-ఆర్ జేడీ కూటమి... విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ దూకుడు పెంచడం...ఆయనకు మద్దతు పెరుగుతోందని సర్వేలు చెబుతుండటంతో బీజేపీ అలర్ట్ అయ్యింది. మోడీ ఎంటర్ అవగానే సీన్‌ మారిపోతుందని.. ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి బీహార్‌లో 12 చోట్ల మోడీ ప్రచారం నిర్వహించనున్నారు.

మోడీతో పాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాహుల్‌ రేపు రెండు ర్యాలీల్లో పాల్గొంటారు. హిసువలోని ర్యాలీలో కాంగ్రెస్ అభ్యర్థి నీతూ సింగ్ ‌తరఫున రాహుల్ ప్రచారం చేస్తారు. భూమిహార్ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూమిహార్ కమ్యూనిటీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.

తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ సంయుక్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల్లో ప్రతి ఫేజ్‌కు రెండు ర్యాలీల చొప్పున మొత్తం 6 ర్యాలీల్లో రాహుల్ పాల్గోనున్నారు. ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేదానిపై మేనిఫెస్టోల ద్వారా స్పష్టతనిచ్చాయి ప్రధాన పార్టీలు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో బీజేపీ చేరింది. బీజేపీ మేనిఫెస్టోను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ ఉచితంగా అందజేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వచ్చే ఐదేళ్లలో 19 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: