ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ మహా నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు... పలు చెరువుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో జనం బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఏ చెరువు కట్ట ఎప్పుడు తెగుతుందోనని భయపడతున్నారు. ఈ పరిస్థితుల్లో చెరువుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే, చెరువులకు శాశ్వత మరమ్మతులకు నిధులు విడుదల చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా మునుపెన్నడూ లేని రీతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వారం రోజుల వ్యవధిలో అతి భారీ వార్షాలు పడ్డాయి. దీంతో నగరంలోని 185 చెరువులు పూర్తిగా నిండిపోయాయి. మూడు చెరువుల కట్టలు తెగాయి. వెంటనే అప్రమత్తమైంది ప్రభుత్వం... మిగతా చెరువుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించింది. చెరువులకు ప్రమాదం జరగకుండా చూడాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు సీఎం కేసీఆర్‌. నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ను ఆదేశించారు కేసీఆర్‌.

హైదరాబాద్‌లో సాధారణంగా ఏడాది పొడవునా కలుపుకుని 80 సెంటీ మీటర్ల వర్షం పడుతుంది. కానీ... కేవలం గత వారం రోజుల్లోనే 70 సెంటీ మీటర్ల వాన కురిసింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గల 185 చెరువులు పూర్తిగా నిండిపోయాయి. అయితే కేవలం మూడు చెరువులకు మాత్రమే గండ్లు పడ్డాయి. అప్పా చెరువు, గుర్రం చెరువు,  పల్లె చెరువుల కట్టలు తెగాయని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్ తెలిపారు. మరో 53 చెరువుల కట్టలు దెబ్బతిన్నాయని వివరించారు. హైదరాబాద్‌లోని 185 చెరువుల వద్ద పరిస్థితుల్ని పర్యవేక్షించడానికి 15 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

ఇంజనీర్ల బృందాలు చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించి, మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపడతాయి. కాగా మరమ్మతుల కోసం 2 కోట్ల రూపాయల వరకూ నిధులు మంజూరు చేసే అధికారాన్ని జీహెచ్ఎంసీ జోనల్‌  కమిషనర్లకు ఇచ్చింది ప్రభుత్వం. గతంలో ఈ పరిమితి 20 లక్షలుగా ఉండేది. నిధులు ముఖ్యం కాదని... ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమన్నారు రజత్‌కుమార్‌.

తెలంగాణ వ్యాప్తంగా 46 వేలకు పైగా చెరువులు ఉన్నాయి. భారీ వర్షాల వల్ల 121  చెరువుల కట్టలు తెగాయి. వీటికి సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని చెబుతున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: