కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. అన్ని కార్యక్రమాలు యధావిధిగా జరుగుతున్నాయి. జనం రోడ్డెక్కుతున్నారు.. వాళ్ల వాళ్ల పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. కానీ ఏపీ సచివాలయంలో మాత్రం ఇంకా సాధారణ పరిస్థితులు కనిపించడం లేదు.   ఇటు మంత్రులు.. అటు ఐఏఏస్‌లు సచివాలయం గడప తొక్కడం లేదు. స్వయంగా సీఎస్‌ కూడా సచివాలయానికి రావడం లేదు. దీంతో పరిపాలన ఎలా అనే విమర్శలు వస్తున్నాయి.

మంత్రులు.. ఐఏఎస్‌ అధికారులు.. సచివాలయ ఉద్యోగులు.. సందర్శకులతో కళకళలాడుతూ ఉండాల్సిన సెక్రటేరీయేట్‌ ఇప్పుడు బోసిగా కనిపిస్తోంది.  కరోనా ముందు వరకు  మంత్రుల రివ్యూలు, సమావేశాలకో కళకళలాడుతూ ఉండేది.  అలాగే  నియోజకవర్గాల్లో పెండింగ్‌ పనులను క్లియర్ చేసుకోవడానికి ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, సందర్శకులతో సందడిగా ఉండేది. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి సెక్రటేరీయేట్‌లో అనధికార 144 సెక్షన్‌ విధించిన పరిస్థితి కనిపిస్తోంది.

సెక్రటేరీయేట్‌లో అన్ని బ్లాకుల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు రావడంతో చాలా కాలం పాటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అవకాశం కల్పించారు.అయితే ఇదంతా కొన్నాళ్ల క్రితం వరకు ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా ముప్పు నెమ్మదిగా తగ్గుతోంది. రోజువారీ జనజీవనం  రెగ్యులర్‌గా నడుస్తోంది. కానీ, ఏపీ సచివాలయంలో మాత్రం పూర్వపు పరిస్థితులు రావడం లేదు. ఇప్పటికీ మంత్రులు, ఐఏఎస్ అధికారులు తమ రోజు వారీ కార్యకలాపాలను నిర్వహించేందుకు సెక్రటేరీయేట్‌కు రావడం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు సెక్రటేరీయేట్‌లో చర్యలు బాగానే తీసుకుంటున్నారు. మాస్క్‌ లేనిదే లోనికి అనుమతించడం లేదు. అలాగే శానిటైజేషన్‌ కూడా బాగానే ఉంది.

అయితే సెక్రటరీలు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు కూడా సచివాలయానికి రావడం లేదు.  ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా సచివాలయానికి ఎందుకు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రులు.. సెక్రటరీలే కాదు.. సచివాలయానికి పెద్ద దిక్కైన సీఎస్‌ నీలం సాహ్నీ  పెద్దగా రావడం లేదు. కరోనా భయంతో మంత్రులు, అధికారులు సెక్రటేరియేట్‌కు రావడం లేదా..? లేక ప్రభుత్వమే సచివాలయాన్ని విశాఖకు మారుస్తోందా కదా అని రావడం లేదా అనే చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: