ఏపీలో బడి గంటలు మోగే సమయం దగ్గర పడింది. నవంబర్‌ రెండు నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన  ఎస్ వో పీని విద్యా శాఖ సిద్ధం చేసింది. ప్రతి రోజు పది నిమిషాలు కరోనాపై అవగాహన తరగతిని నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన పాఠశాలలు నవంబర్‌ రెండు నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా మహమ్మారి ఇంకా కట్టడిలోకి రాకపోవటంతో అన్ని రకాల జాగ్రత్తలతో స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ సిస్టమ్‌ను విద్యాశాఖ సిద్ధం చేసింది. 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులు ఒక రోజు.. 2,4,6,8 తరగతుల విద్యార్ధులు మరో రోజు క్లాసులు నిర్వహిస్తారు. నవంబర్‌ నెల అంతా ఒంటి పూట మాత్రమే బడులు నిర్వహించునున్నారు. పరిస్థితిని బట్టి డిసెంబర్‌లో పని వేళలను నిర్ణయిస్తారు.  ఈ విద్యా సంవత్సరం 80 రోజుల పని దినాలు తక్కువ అవుతున్నాయి. అంటే సుమారు 3 నెలల వర్కింగ్‌ పీరియడ్‌ తగ్గింది.

నవంబర్‌ స్కూళ్ళు తెరిచినా ఒంటి పూట, ఒక రోజు విడిచి, ఒక రోజు విధానంతో నిర్దేశిత సిలబస్‌ పూర్తి చేయటం సాధ్యం కాదు. అందుకే సెలవులను సాధ్యమైనంత తగ్గించటం, ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించటం వంటి విషయాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ఇక కరోనా బారిన విద్యార్ధులు పడకుండా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. స్థానిక పారా మెడికల్‌ సిబ్బంది  ఎప్పటికప్పుడు స్కూళ్ళకు వెళ్లి పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని  ఆరోగ్యశాఖతో సంప్రదింపులు చేస్తోంది విద్యాశాఖ.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. బడి గంట మోగేందుకు సమయం ఆసన్నమైంది. స్కూళ్లలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే విద్యను కొనసాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకేముందీ పాఠశాల నిర్వహకులు ఆ పనిలో నిమగ్నమైపోయారు. అంతేకాదు స్థానిక పారా మెడికల్ సిబ్బంది.. ఎప్పటికప్పుడు స్కూళ్లను పర్యవేక్షించనుంది. చూద్దాం.. పాఠశాలల నిర్వహణ ఎలా కొనసాగనుందో.







మరింత సమాచారం తెలుసుకోండి: