అవకాశం వస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడుతుంటారు పవన్ కల్యాణ్. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్క సందర్భంలో మినహా.. ఇంకెప్పుడూ ఆయన పథకాలను కానీ, ఆయన చేసిన పనుల్ని కానీ పవన్ మెచ్చుకున్న దాఖలాలు లేవు. పవన్ కల్యాణ్ మెప్పులు మాకు అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నా.. ఆయన విమర్శల్ని మాత్రం తీవ్ర స్థాయిలో తిప్పికొడుతుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఇటీవల వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న హైదరాబాద్ వాసులకోసం పవన్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి తన ఆర్థిక సాయాన్ని అందజేసిన పవన్, ఏపీని మాత్రం తలచుకోలేదు. ఏపీలో కూడా అదే సమయంలో వర్షాలు పడి, రైతులు ఇబ్బందులు పడ్డారు. గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటిని ప్రస్తావించకుండా కేవలం హైదరాబాద్ వాసులకి మాత్రమే అండగా నిలబడ్డ పవన్ తీవ్ర విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు మళ్లీ ఏపీ ప్రభుత్వంపై నిందలు వేయడం మొదలు పెట్టారు.

ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట నష్టంపై ఆవేదన వ్యక్తం చేసిన పవన్, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదని.. పరిహారాన్ని అందించడంలో పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత ఏడాది చెల్లించాల్సిన పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, తక్షణమే పరిహారం చెల్లిస్తే రైతులు తదుపరి పంటకు సిద్ధం అవుతారన్నారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. వరద ప్రభావిత జిల్లాల్లో జనసేన నాయకులు పర్యటించి పొలాలను పరిశీలిస్తారని పవన్ చెప్పారు.

పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్ ఇప్పుడు పుండుమీదద కారం చల్లినట్టుగా ఉంది. హైదరాబాద్ లో ఆక్రమణల పర్వాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే అక్కడ పెద్ద విపత్తు తలెత్తింది. అక్కడ వరదలు వస్తే కనీసం ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనని జనసేనాని కోటి రూపాయల విరాళం ఇచ్చి మరీ తన పెద్దమనసు చాటుకున్నారు. ఏపీలో వరదలు వచ్చి రైతులు నష్టపోతే.. పరిహారం మాట పక్కనపెట్టి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వరదసాయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని ప్రశ్నిస్తున్నారు. అక్కడ కేసీఆర్ ని ప్రశ్నించలేని పవన్, ఇక్కడ జగన్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ మరోసారి వైసీపీ శ్రేణులు పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: