చైనా యాప్స్ నిషేధించే క్రమంలో పబ్ జీ గేమ్ ని కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే అప్పటికే ఇన్ స్టాల్ చేసుకున్నవారు దీన్ని వాడుతున్నారు. పబ్ జీ పీసీ వెర్షన్ కూడా అందుబాటులోనే ఉంది.  కేవలం ఆన్ లైన్ లో పబ్ జీ ఆడేందుకు మాత్రం వారికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి అడ్డంకులు కూడా లేకుండా పబ్ జీ ని పాత పద్ధతిలోనే ఆడుకునేందుకు గేమింగ్ ప్రియులకు అవకాశం దొరుకుతున్నట్టు తెలుస్తోంది. అయితే పబ్ జీ పేరు మార్చుకుని వస్తుందా లేక భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రంగంలోకి దిగుతుందా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది.
పబ్‌జీ గేమింగ్‌ యాప్‌ త్వరలోనే తిరిగి భారత్‌లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. పబ్‌జీ కార్పొరేషన్‌ యజమాని, దక్షిణ కొరియాకు చెందిన క్రాఫన్‌ సంస్థ భారత్‌లో నియామకాలు చేపట్టడం కోసం లింక్డ్ ‌ఇన్ వెబ్ సైట్ లో ఓపెనింగ్స్ ప్రకటించింది. ‘కార్పొరేట్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ మేనేజర్‌’ పోస్ట్ ల పేరుతో రిక్రూట్ మెంట్ స్టార్ట్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ని బట్టి చూస్తే ఆ మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ తిరిగి భారత్‌లో అడుగుపెడుతోందన్న వార్తలు నిజమేనని అనిపిస్తున్నాయి. భారత్ లోకి తిరిగి వచ్చే క్రమంలోనే సదరు కంపెనీ భారీ రిక్రూట్ మెంట్ కి తెరతీసిందని అంటున్నారు.

అయితే టెన్సెంట్ అనే చైనా కంపెనీ పేరుతో కాకుండా క్రాఫన్ అనే కంపెనీ పేరుతో రిక్రూట్ మెంట్ స్టార్ట్ చేయడం విశేషం. చైనా కంపెనీ టెన్సెంట్‌ గేమ్స్‌ పబ్ జీ కి సంబంధించి 1.5 శాతం వాటాను బ్లూహోల్‌ స్టూడియోలో కొనుగోలు చేసిన నేపథ్యంలో పబ్‌జీ గేమ్ పై భారత్ నిషేధం విధించింది. దానితో పాటు 117 చైనా యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే టెన్సెంట్‌ గేమ్స్‌ నుంచి పబ్‌జీ కార్ప్‌ పబ్లిషింగ్‌ హక్కులను వెనక్కి తీసుకుంది. దీంతో భారత ప్రభుత్వం పబ్ జీ గేమ్ కి తిరిగి అనుమతి ఇస్తుందా అనే విషయం సస్పెన్స్ గా మారింది. పబ్ జీ కి అలవాటు పడ్డ చాలామంది యువత ఆల్టర్నేట్ గేమింగ్ యాప్స్ లేక అల్లాడిపోతున్నారు. మరోవైపు టిక్ టాక్ కి కూడా ఇప్పటి వరకూ సరైన ప్రత్యామ్నాయం దొరకలేదు. ఈ నేపథ్యంలో పబ్ జీ తిరిగి వస్తుందన్న వార్త గేమింగ్ ప్రియులకు పండగలాంటిదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: