జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా వచ్చాక ఒక విషయంలో మాత్రం పక్కా క్లారిటీ ఉంది. ఆయన మీడియా దగ్గర హడావుడి చేయరు. మీడియాకు కడు దూరం పాటిస్తారు. అలా  చేయకపోవడం వల్ల ఆయనకు ఎంత ప్లస్ అన్నది తెలియకపోయినా కొన్నిసార్లు మైనస్ అని చెప్పాల్సివస్తోంది. ఇపుడు చూస్తే ఒకేసారి ఏపీ, తెలంగాణా రాష్ట్రాలను తాజాగా వరదలు వచ్చి దారుణంగా నష్టపరచాయి. తెలంగాణా సీఎం కేసీయార్ వరదలతో నష్టపోయిన తెలంగాణాను ఆదుకోవాలంటూ మీడియా ముఖంగా కోరారు. ఇక ఏపీ సర్కార్ ఆ విషయంలో ఎందుకో చొరవ చూపలేదు.

దాంతో తెలంగాణాకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా మొఘల్ రామోజీరావు లాంటి పెద్దలు ఏకంగా అయిదు కోట్ల రూపాయలను విరాళంగా సీఎం సహాయ నిధికి ఇచ్చారు. మరో వైపు చూస్తే టాలీవుడ్ హీరోలు అంతా స్పందించి పెద్ద ఎత్తున సహాయం చేశారు. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్వచ్చంద సంస్థల పెద్దలు  కూడా విరాళాలు ఇచ్చారు.  అన్నిటికీ మించి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా విరాళలు ప్రకటించారని అంటున్నారు.

మరి ఏపీ కూడా దారుణంగా నష్టపోయింది. కానీ ఏ ఒక్కరూ స్పందించడంలేదు. ఏపీ సీఎం జగన్ అడగకపోవడం వల్లనే ఎవరూ ఏమీ ఇవ్వడంలేదని టీడీపీ అనుకూల మీడియా అయితే తెగ రాతలు రాస్తోంది. చిత్రమేంటంటే ఆ రాతలు రాసే మీడియా, టాలీవుడ్ హీరోలు, మీడియా పెద్దలు అందరూ కూడా ఆంధ్రా వారే. కానీ వారంతా ఇపుడు తెలంగాణాలో ఉన్నారు కాబట్టి మెహర్బాణీకో, మొహమాటానికో, భయానికో, భక్తికో విరాళాలు దండీగానే ఇచ్చారు.

ఇక్కడ ఏపీ సర్కార్ మాత్రం మౌనంగా ఉండడం కొంత విమర్శలకు కూడా దారితీస్తోంది. మనకు ఒక సామెత ఉంది. అడగందే అమ్మ అయినా పెట్టదని, అసలే ఏపీ సీఎం జగన్ అంటే పడని శక్తులే అనేక రంగాల్లో ఉన్నాయి. మరి వారి అసలు రంగు బయటపెట్టడానికైనా జగన్ వరద సహాయం కోసం ఆదుకోవాలని అందరికీ ఒక పిలుపు ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఇపుడు జగన్ అడగలేదు అంటున్న వారు రేపు ఆయన పిలుపు ఇస్తే ఏ మేరకు స్పందిస్తారో చూడాలి. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణా సీఎం కేసీయార్ ని ప్రో యాక్టివ్ సీఎం అంటున్నారు. ఏపీ  సీఎం  కూడా అలాగే చేయాలని సూచిస్తున్నారు. అక్కడ కోటి రూపాయలు విరాళంగా పవన్ ఇచ్చారు. మరి జగన్ అడిగితే ఎంత ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: