తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ.. ఆడపడచుల పండుగ బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు.. జీవన విధానానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడే కనిపిస్తుంది. మొదటి రోజు ఎంగలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆడపడచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే బతుకమ్మ పండగను పురస్కరించుకుని నగరానికి చెందిన కళాకారుడు నరేందర్ ఏకంగా 108 బియ్యపు గింజలపై బతుకమ్మ చిత్రాలను చిత్రీకరించాడు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మను బియ్యపు గింజలపై చిత్రీకరించడంతో పలు అవార్డులు సాధించినట్లు ఆయన తెలిపారు.

బతుకమ్మ మహిళా శక్తికి ప్రతిరూపం. 108 గింజలపై రంగులతో బతుకమ్మతోపాటు బతుకమ్మను తీసుకెళ్తున్న మహిళల చిత్రాలను వేశాడు. ప్రతీ గింజపై రంగులతో బతుకమ్మను చిత్రీకరించడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుందని నరేందర్ చెప్పుకొచ్చాడు. 108 బియ్యపు గింజలపై బతుకమ్మను చిత్రీకరించేందుకు 45 రోజుల సమయం పట్టిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం నరేందర్ ఎన్.ఐ.ఆర్.డీ భారతీయ విద్యాభవన్ లో విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై మక్కువ ఎక్కువని, అందుకే డిగ్రీ కూడా చిత్రలేఖనంలోనే పూర్తి చేశారన్నారు. ఇప్పటికే పలు చిత్రాలను అవార్డులు దక్కించుకున్నాడు. త్వరలో పురాణ కావ్యాలను బియ్యపు గింజలపై చిత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు నరేందర్ వెల్లడించాడు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకునే బతుకమ్మ పండుగ దసరాకు రెండు రోజుల ముందు వస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచే బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ శనివారం అశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) రోజున సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆడపడచులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: