విరాళిమలై కామరాజనగర్ జంక్షన్ లో జల్లికట్లు ఎద్దు విగ్రహాన్ని ప్రతిష్టించారు. తమిళనాట సాహసక్రీడ జల్లికట్టుకు ప్రత్యేక గౌరవం కల్పిస్తూ పుదుకొట్టైలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జల్లికట్టు ఎద్దు పొగరును క్రీడాకారుడు అణగదొక్కే రీతిలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. గురువారం సీఎం పళనిస్వామి అక్కడికి చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సీఎం పళనిస్వామి పుదుకొట్టై పర్యటన నిమిత్తం ఉదయం చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో ప్రయాణమయ్యారు. అక్కడి విమానాశ్రయంలో మంత్రులు వెల్లమండి నటరాజన్, వలర్మతి, విజయభాస్కర్, తిరుచ్చి కలెక్టర్ శివరాజ్ సీఎంకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పుదుకొట్టైకు సీఎం చేరుకున్నారు.

విరాళిమలైలో ఐటీసీ సంస్థ ఆహార ఉత్పత్తి పరిశ్రమల విస్తరణ పనుల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి విరాళిమలై కామరాజనగర్ జంక్షన్ లో జల్లికట్లు ఎద్దు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవల పుదుకొట్టై జిల్లాలో 110 చోట్లల్లో జల్లికట్టును నిర్వహించడంతో గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఈ గుర్తింపునకు గౌరవంగా జల్లిగట్టు ఎద్దును, క్రీడాకారుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. రంకెలేస్తున్న ఎద్దును లొంగదీసుకునే క్రీడాకారుడి రూపంలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు కళాకారులు.

ఈ సందర్భంగా కామరాజనగర్ లో బారులు తీరిన జల్లికట్లు ఎద్దులను సీఎం పళనిస్వామి పరిశీలించారు. ఎద్దుల ముక్కుతాడు పట్టుకున్నారు. ఎడ్లబండిలోకి ఎక్కి తోలుకుంటూ ముందుకుసాగారు. అనంతరం అక్కడే జరిగిన రైతుల సమస్యల పరిష్కార కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలు తెలుసునని, పుదుకొట్టై వాసుల కల త్వరలో నెరవేరుతుందన్నారు. కావేరి-వైగై-గుండారుల అనుసంధానం త్వరలో జరిగి తీరుతుందని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు. ప్రజల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: