అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు అనుకున్నదే ఇపుడు ఏపీలో అమలవుతోందా అన్న చర్చ సాగుతోంది. అమరావతిని ఏకైక‌ రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు మొదటి నుంచి పట్టుపడుతున్నారు. ఎన్నికల్లో మూడు రాజధానుల సంగతి చెప్పలేదు కాబట్టి ఇపుడు హఠాత్తుగా అసెంబ్లీలో మందబలం ఉందని కారణంతో కీలకమైన ‌ నిర్ణయం తీసుకోవడం తగదు అని ఆయన అంటున్నారు. దీని మీద ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి మరీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

అయితే తాము 151 సీట్లతో అధికారంలోకి వచ్చామని తామెందుకు రాజీనామా చేయాలని వైసీపీ పెద్దలు అంటున్నారు. అమరావతి సహా మూడు ప్రాంతాల్లో వైసీపీకి బంపర్ మెజారిటీ వచ్చిందని, ప్రజలు కూడా ఆదరించారని, అందువల్ల తన నిర్ణయం కరెక్ట్ అంటోంది. అవసరం అయితే విపక్ష తెలుగుదేశం పార్టీయే రాజీనామా చేసి తమ ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలు ఎదుర్కోవాలని కూడా సూచిస్తోంది.

సరే ఈ తగవు ఎలా ఉన్నా కూడా మూడు రాజధానుల విషయం ఇపుడు కోర్టు ముంగిట ఆగింది. దాని ముందూ తరువాత అనేకమైన  పరిణామాలు జరిగాయి. చూస్తూండగానే వైసీపీ తొందరలో రెండేళ్ళు పూర్తి చేసుకోబోతోంది. ఇక మరోవైపు  2022 లో జమిలి ఎన్నికలు ఉన్నాయని చెబుతున్నారు.  అప్పటికి అమరావతి అజెండాతో టీడీపీ బరిలోకి దిగాలనుకుంటోందిట.

మూడు రాజధానులు వద్దు ఒకటే రాజధాని అని టీడీపీ పోటీ చేస్తే మూడు రాజధానులతో వైసీపీ పోటీ రంగంలో ఉంటుందన్న మాట. అపుడు జనం తమకు అనుకూలంగా తీర్పు చెబుతారు అని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉంది. మరి చూస్తూంటే మూడు రాజధానుల మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో పాటు రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలేదని టీడీపీ చేస్తున్న ప్రచారం జనంలోకి వెళ్తే జగన్ పార్టీకి చిక్కులు తప్పవని అంటున్నారు. మరి చూడాలి వైసీపీ దీని మీద కొత్త ప్లాన్ ఏమి వేస్తుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: