2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎక్కువ అంచనాలతో బరిలో దిగిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ప్రభావం బాగా ఉంటుందని ఆయన అభిమానులు భావించారు. కానీ ఊహించని విధంగా జనం జగన్‌కు మద్ధతు తెలపడంతో పవన్ కల్యాణ్‌కు భారీ షాక్ తగిలింది. జనసేన అభ్యర్ధులు అన్నిచోట్ల ఘోరంగా ఓడిపోగా, పవన్ కూడా పోటీ చేసిన రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. అయితే ఇంత ఓటమిలో కూడా పవన్ అభిమానులుకు ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందటే అది రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్‌నే.

కానీ రాపాక జనసైనికులకు ఆ ఆనందాన్ని ఎక్కువసేపు ఉంచలేదు. ఆయన కొన్నిరోజులకే వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. పరిస్థితులని బట్టి జగన్‌కు సపోర్ట్ ఇస్తూ ఇచ్చారు. మొన్న ఆ మధ్య అయితే పూర్తిగా వైసీపీ వైపు వచ్చేశారు. అలా అని పవన్ ఆయన మీద వేటు వేసే సాహసం చేయలేదు. దీంతో రాపాక ఇష్టారాజ్యంగా నడుచుకున్నారు. ఇక జనసేన రాపాకని పట్టించుకోవడం మానేసింది.

ఇలా జనసేనకు దూరమైన రాపాక పరిస్తితి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. అటు జనసేన నేత కాదు. అలా అని వైసీపీ ఎమ్మెల్యే కూడా కాదు. ఇప్పుడు వైసీపీకి మద్ధతు ఇచ్చినా కూడా, భవిష్యత్‌లో రాజోలు సీటు వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే రాజోలు వైసీపీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో ఉన్న అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావులు కూడా దూకుడుగా ఉన్నారు. ఇటు రాపాక కూడా తన వర్గాన్ని నడుపుతున్నారు.

దీంతో రాజోలు వైసీపీ మూడు ముక్కలైంది. అయితే భవిష్యత్‌లో జగన్....రాపాకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు వైసీపీ నుంచి సీటు రావడం కష్టమని తెలుస్తోంది. అటు అమ్మాజీ, రాజేశ్వరరావులు సైతం పార్టీ కోసం కష్టపడుతున్నారు. కాబట్టి వీరిలో ఒకరికి సీటు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే జనసేనని వదిలిన రాపాకకు పెద్ద షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: