ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. విమర్శల దాడిని పెంచారు. ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తూనే.. పక్క దేశాలపైనా అక్కసు వెళ్లగక్కుతున్నారు. తాజాగా మరోసారి ఇండియాపై నోరు పారేసుకున్నాడు ట్రంప్.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా చెప్పుకునే అధ్యక్ష అభ్యర్థుల సంవాదం, ఫైనల్‌ ఫేస్‌ టు ఫేస్ డిబేట్‌ చర్చ ఈ సారి ఎలాంటి రసాభాస లేకుండా ముగిసింది. కరోనా వ్యాప్తి సహా అనేక అంశాలపై చర్చించిన ఇరువురు నేతలు.. పరస్పర విమర్శలు సంధించుకున్నారు. అయితే కమిషన్‌ పకడ్బందీ చర్యల కారణంగా.. ఇద్దరి మధ్యా ఎలాంటి రభసా జరగలేదు.

ఇక కాలుష్యం అంశంపై చర్చ సందర్భంగా.. భారత్‌పై నోరు పారేసుకున్నారు అధ్యక్షుడు ట్రంప్‌. భార‌త్‌, చైనా, ర‌ష్యా దేశాల్లో వాయు నాణ్యత అత్యంత మురికిగా ఉన్నట్లు చెప్పారు. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి త‌ప్పుకోవ‌డానికి గల కార‌ణాలు వెల్లడించిన ట్రంప్‌.. త‌న నిర్ణయాన్ని స‌మ‌ర్థించుకున్నారు.  చైనా, ర‌ష్యా, ఇండియాలను చూడండి.. ఎంత రోతగా ఉన్నాయో అంటూ ఎత్తిపొడిచారు.

వాతావ‌ర‌ణ మార్పుల అంశంలో భార‌త్, చైనా లాంటి దేశాలు ఎటువంటి స‌హ‌కారం అందించ‌లేద‌ని.. కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల చేస్తున్న దేశాల్లో భార‌త్ నాల్గో స్థానంలో ఉందని ట్రంప్‌ చెప్పారు. దేశంలో కాలుష్యం ఎక్కువని చెబుతూ.. ఫిల్‌తీ ఇండియా అని కామెంట్స్‌ చేశారు ట్రంప్‌. భారత్‌పై ట్రంప్ చేసిన కామెంట్స్‌ను.. నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. మోడీ స్నేహితుడు ట్రంప్‌ భారత్‌పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అర్థం చేసుకోవాలంటూ.. కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు.

మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో ఉన్నాడు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకోసం ఎన్నికల ప్రచారం చేయాల్సింది అంతా చేస్తున్నాడు. నోటి కొచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి బైడెన్ పై విమర్శలు లేవనెత్తడమే కాకుండా వివిధ దేశాలపై నోరుపారేసుకుంటున్నాడు.గెలవడమే లక్ష్యంగా.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయిపోయాడు.









మరింత సమాచారం తెలుసుకోండి: