ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ భేటీ కానున్నారు. అయితే ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

ఏపీలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెరమీదకు వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నెల 28న ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించాలని... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నిర్ణయించారు. దీంతో ఇప్పుడు లోకల్‌బాడీ ఎలక్షన్స్‌.. రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.

ఎన్నికల కోసం ఈసీ ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పారు మంత్రి గౌతంరెడ్డి.  కరోనా ఇప్పుడు తగ్గుముఖం పట్టినా నవంబర్‌, డిసెంబర్ నెలలో రెండవ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈసీ నిర్వహించే ఆల్‌పార్టీ మీట్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పే అవకాశం ఉంది ప్రభుత్వం.

ఈ ఏడాది మార్చి 7న  స్థానిక  సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు  నిర్వహించాలని అనుకున్నారు. 2వేల129 ఎంపీటీసీ స్థానాలు, 125 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కూడా అయిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు కూడా నామినేషన్ల ప్రక్రియ వరకు వచ్చినా.. కరోనా కారణంగా అన్నీ వాయిదా పడ్డాయి. అయితే, ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఈ వ్యవహారం కోర్టులకు చేరింది.

అయితే మళ్లీ ఎన్నికల నిర్వహణ మొదలుపెడితే.. అప్పట్లో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని డిమాండ్  చేస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆల్‌పార్టీ మీటింగ్‌ నిర్వహించనున్న ఎస్ఈసీ.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి వాదనను వినిపిస్తాయనే అంశమై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.





మరింత సమాచారం తెలుసుకోండి: