ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద చిక్కుముడులు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం తొలిదశలో ఉన్న సమయంలో ఏపీలో ఈ సంవత్సరం ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అని వైసిపి గట్టిగానే పట్టుబట్టింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల తంతు మొత్తం పూర్తవుతుందని అంతా భావిస్తున్న సమయంలో, అకస్మాత్తుగా ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం, ఈ వ్యవహారంపై వైసిపి కోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత నానా రాద్ధాంతం చేయడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడుతుండగా, వైసిపి మాత్రం ఇప్పట్లో ఎన్నికల మొదలుపెట్టడానికి వీలు లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది.


 ఈ విషయం పైన మళ్లీ వివాదం చెలరేగేలా కనిపిస్తోంది. ఈనెల 28వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ నిమ్మగడ్డ భేటీ కాబోతున్నారు. దీంతో ఈ సమావేశం పై ఉత్కంఠ నెలకొంది. మర్చి 7న  స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కాకపోతే కరోనా కారణంగా ఆ ఎన్నికలను వాయిదా వేస్తూ, మార్చి 15న ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన చేశారు. మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ , ఎన్నికలను నిర్వహించాలని అనుకున్నారు.  2129 ఎంపీటీసీ స్థానాలు, 125 జడ్పిటిసి స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వరకు వచ్చిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడడంతో,  ఏకగ్రీవాలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.


ఇదిలా ఉండగా, నవంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలయ్యే అవకాశం లేదంటూ ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం కాస్త అదుపులో పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తున్నా, రానున్న రోజుల్లో  ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించడంతో, ఇప్పట్లో ఈ ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదంటూ, ఏపీ మంత్రి వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం బీహార్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా,  అవి తప్పని సరి ఎన్నికలు కావడం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు ఉండడం వంటి విషయాలను వైసీపీ ఇప్పుడు హైలెట్ చేస్తోంది. ఏది ఏమైనా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పెద్ద తలనొప్పిగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: