ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లాలంటే, సిఎం కాన్వాయ్ తాడేపల్లి మండలం మెయిన్ రోడ్డు మీదుగా వెళ్తుంది. ప్రతీరోజూ ఆ దారిలోనే సిఎం ఆఫీస్ కు, అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. అయితే శుక్రవారం ఉన్నట్టుండి మెయిన్ రోడ్డు వద్ద భూమి కంపించింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తమ వాహనాలను నిలిపివేశారు. అందరూ చూస్తుండగా సుమారు మూడు అడుగుల వెడల్పుతో ఆరడుగుల లోతు రోడ్డు పై భాగం కుంగిపోయింది. అదే సమయంలో ఆ మెయిన్ రోడ్డు మీదుగా వస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పరిశీలించారు. వెంటనే అధికారులకు కాల్ చేసి, మరమ్మత్తులు చేయాల్సిందిగా కోరారు. అధికారులు కూడా వెంటనే స్పందించి రంగంలోకి దిగి పనులు మొదలుపెట్టారు.


ఇక్కడ వరకూ బాగానే ఉంది. సిఎం జగన్ గారు ప్రతిరోజూ ఆ రోడ్డు మీదుగా ప్రయాణిస్తారు కాబట్టే ఎమ్మెల్యే గారు వేగంగా స్పందించారా? లేక నిజంగానే బాధ్యత గల నాయకుడిగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఫోన్ లు చేసి అధికారులని రప్పించి, మరమ్మత్తులు చేయిస్తున్నారా? అని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి ఎమ్మెల్యే మాకు ఉంటే బాగుండేది అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మా జిల్లాల్లో కూడా సిఎం గారు ఒకసారి పర్యటిస్తే మా ఎమ్మెల్యేలు చురుకుగా పని చేస్తారని, ఒక్క ఫోన్ కాల్ తో అధికారులను రప్పించి, రోడ్లను మరమ్మత్తులు చేయిస్తారని కోరుతున్నారు. అధికారంలోకి వచ్చే ముందు ఎలా అయితే పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారో, అలానే అధికారంలోకి వచ్చాక కూడా ఒకసారి ప్రజల్లో పర్యటిస్తే తమ సమస్యలు తెలుస్తాయని పలు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై సిఎం గారు దృష్టి సారిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: