ఏపీ రాజకీయాలు మహా రంజుగా సాగుతున్నాయి. విచిత్రం ఏంటంటే..పాలకులతో పాటు.. రాజ్యాంగ బద్ద సంస్థ  అయిన ఎన్నికల కమిషన్ కూడా ఓ రాజకీయ సంస్థ తరహాలో ప్రవర్తిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు స్థానిక సంస్థల నిర్వహణే ఓ ఉదాహరణగా నిలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కూ సీఎం జగన్‌ కూ మొదట వచ్చిన గొడవ ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనే.. ఈ ఏడాది మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. కొన్ని చోట్ల ఎన్నికలు కూడా ప్రారంభం అయ్యాయి.

అలాంటి సమయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అకస్మాత్తుగా ఎన్నికలను వాయిదా వేశారు. కరోనా రావడమే ఇందుకు కారణం అన్నారు. విచిత్రం ఏంటంటే అప్పటికే కేవలం ఒకే ఒక్క కరోనా కేసు ఏపీలో నమోదైంది. అయినా సరే ఎన్నికలు నిర్వహించడం కుదరదన్నారు. అంతే కాదు.. అంత పెద్ద నిర్ణయాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రంగానైనా చెప్పలేదు. దీంతో సీఎం జగన్‌కు చిర్రెత్తుకొచ్చింది. నిమ్మగడ్డ తన కులం వాడైన చంద్రబాబు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు.

ఆ తర్వాత నిమ్మగడ్డ పదవీకాలాన్ని నాలుగేళ్లకు కుదించడం ద్వారా ఆయన్ను పదవీ నుంచి తొలగించడం.. తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్‌ ను ఆ స్థానంలో నియమించడం జరిగిపోయాయి. మళ్లీ నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లి కేసు గెలిచి తన స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రోజూ కనీసం 3 వేల కరోనా కేసులు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆగిపోయిన ఎన్నికలు తిరిగిపెట్టే ఆలోచన చేస్తున్నారు ఎస్‌ఈసీ.

విచిత్రం ఏంటంటే.. కరోనా ఒక్క కేసు ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాల్సిందే అని జగన్ అన్నాడు.. కుదరదని నిమ్మగడ్డ అన్నాడు.. ఇప్పుడు వేల కేసులు వస్తుంటే.. ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నాడు.. జగన్ మాత్రం అబ్బే ఇప్పుడు కుదరదు అన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. మొత్తానికి ఇటు నిమ్మగడ్డ, అటు జగన్ ఇద్దరూ భలే ప్లేటు ఫిరాయిస్తున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: