చంద్రబాబు విపక్ష నేత. మాజీ ముఖ్యమంత్రి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో తోటి నాయకులు అధికార  పీఠాల మీద ఉంటే బాబు మాత్రం 2019 ఎన్నికలు కొట్టిన దెబ్బకు మాజీగా మారిపోయారు. ఆనాటి నుంచి నేటి వరకూ చూసుకుంటే టీడీపీ గ్రాఫ్ కూడా అసలు పెరగలేదు. దీంతో బాబు అండ్ కో లో ఒక్కసారిగా కంగారు కూడా మొదలైంది.  ఏపీలో టీడీపీకి సీన్ లేదు అనేంతగా జగన్ రాజకీయాన్ని  దూకుడుగా నడిపించడంతో పాటు ఎమ్మెల్యే తమ్ముళ్ళు కూడా ఫ్యాన్ నీడకు చేరుకోవడంతో అధినాయకత్వం తల్లకిందులైంది.

అయితే అన్ని రోజులూ ఒక్కలా ఉండవు కదా. ఇపుడు టీడీపీలో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. అదే జమిలి ఎన్నికలు. చంద్రబాబు ఆ విషయాన్ని తమ్ముళ్ళకు ప్రతీ రోజూ చెబుతూ కళ్ళు మూసుకుంటే చాలు మరో ఏడాదిన్నరలో మనదే అధికారం అని నూరి పోస్తున్నారు. అంతే కాదు దీనినే తారకమంత్రంగా చేసుకుని పార్టీని పటిష్టం చేయాలనుకుంటున్నారు. ఇక పార్టీకి కొత్త కళను కట్టించేలా కమిటీలను ప్రకటించారు. పెద్ద నోరు అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. బీసీలకు పెద్ద పీట వేశామనిపించుకున్నారు. దాంతో పాటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కష్టపడి పనిచేసిన వారికే టికెట్లు అని కూడా హామీలు ఇస్తున్నారు.

ఇక కేంద్రంలోని బీజేపీతో దోస్తీకి బాబు చేయని ప్రయత్నం లేదు. తాజాగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుట్టిన రోజు వేళ గుట్టు చప్పుడు కాకుండా ఫోన్ చేశారట. ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ తన మంచితనాన్ని అలా చాటుకున్నారట. పనిలో పనిగా కేంద్రంలో తనకు మరో మిత్రుడిగా ఉన్నా బీజేపీ మంత్రి పీయూష్ గోయల్ ని కూడా బాబు ఫోన్ లో పలకరించారట. ఆయన అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఆయనకు బాబు కర్టెసీ కాల్ చేశారని అంటున్నారు.

ఇలా ఏపీలో పార్టీకి గేరప్ చేయడంతో పాటు కేంద్రంలోని బీజేపీని దగ్గర చేసుకోవడం ద్వారా ఎన్నికలు ఎపుడు వచ్చినా మేము రెడీ అని బాబు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ, వైసీపీ కలవకుండా బాబు సరికొత్త  ఎత్తుగడలు  వేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే అయిదేళ్ల సీం గా నెగ్గిన జగన్ని మూడేళ్ళకే ఇంటికి పంపేసే మాస్టర్ ప్లాన్ తో బాబు రెడీగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: