విశాఖ  అందమైన నగరం. అంతకంటే ఒక మహానగరం. విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ఇది అందమైన గమ్యస్థానం. విశాఖకు ఇపుడు అదనంగా పాలనారాజధాని అని మరో కీర్తి కిరీటం వచ్చి చేరింది. విశాఖను జీవితంలో ఒక్కసారి అయినా చూడాలనుకునేవారే ప్రపంచం నిండా ఉంటారు. ఇక విశాఖలో చిన్న పొదరిల్లు కట్టుకుని సెటిల్ అవాలనుకునేవారు చాలా మందే ఉంటారు. రోజురోజుకూ భూమి తగ్గిపోయి దాని విలువ పెరిగిపోతున్న వేళ విశాఖ లాంటి మహానగరాల్లో భూములకు రెక్కలు వచ్చాయంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.

విశాఖలో ఇపుడు పెద్దలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకునే ఆపరేషన్ కొనసాగుతోంది. మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారీ గోడను కూల్చిన తరువాత మరో రాజకీయ దుమారం రేగేలా మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తికి చెందిన గీతం విద్యా సంస్థలు ఆక్రమించిన్నట్లుగా  చెప్పబడుతున్న 40 ఎకరాలా భూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఇదిపుడు రాజకీయంగా అతి పెద్ద భూకంపాన్నే సృష్టిస్తోంది. ఎందుకంటే మూర్తి కుటుంబం వేరు కాదు, ఆయన చంద్రబాబుకు దగ్గర చుట్టం. మూర్తి మనవడు బాబు బామరిది బాలయ్యకు స్వయాన అల్లుడు. ఇక లోకేష్ కి తోడల్లుడు. దాంతో ఇది ఎక్కడికో దారితీసే పెను వివాదంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే భూ ఆక్రమణలు ఎక్కడ జరిగినా అరికట్టడం ప్రభుత్వం విధి. కాబట్టి అలాగే చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

దాదాపుగా 800 కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆక్రమించుకుంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దా అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అంటున్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ అంటున్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న కార్యక్రమంగా కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే విశాఖలో వేలాది ఎకరాలు భూ దందాలకు  గురి అయ్యాయి. అవన్నీ రాజకీయ పెద్దల గుప్పిట ఉన్నాయి. మరి ఆ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. అదే కనుక జరిగితే రాజకీయ దుమారం కాదు పొలిటికల్ సునామీవే చెలరేగుతుంది అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: