అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ఇండియా తమ ఇంటివాడు అనుకుంది. అమెరికాకు పనిచేసిన ఏ ప్రెసిడెంట్ కూడా ఇంత చొరవగా ఇండియాతో కలసిపోయిన దాఖలాలు లేవు. గతంలో పనిచేసిన వారు కూడా భారత్ తో మంచి సంబంధాలే నెరిపారు. అయితే వారంతా వాణిజ్యం ఇతర అంశాల వరకే పరిమితం అయ్యారు. కానీ ట్రంప్ మాత్రం భారతీయులకు ఒక ప్రత్యేకంగా కనిపించాడు. అంతే కాదు ఆయన భారత ప్రధాని మోడీని తన ప్రాణ స్నేహితుడు మాదిరిగా దగ్గరకు తీసుకున్నారు. ఈ ఇద్దరి మిత్రులను చూసిన వారంతా ఆశ్చర్యపోయేవారు. వీరు కూడబలుక్కుని ఒకేమారు రెండు పెద్ద దేశాలకు పెద్దలు అయ్యారా అన్న డౌట్లు కూడా వచ్చిన సందర్భాలు వున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ భారతదేశం తన సహజ మిత్ర దేశం అని ఎన్నో సార్లు చెప్పారు. కానీ ఆయన ఇపుడు అమెరికా ఎన్నికల సమయాన  ఒక్కసారిగా మారిపోయారు అంటున్నారు. తరచూ భారత్ మీద విమర్శలు చేస్తున్నారు. గతంలో నమస్తే ట్రంప్ పేరిట భారత్ ఇచ్చిన ఆతిధ్యాన్ని కానీ హౌడీ మోడీ పేరిట తనను ప్రవాస భారతీయులకు చేరువ చేసిన భారీ కార్యక్రమం కానీ ట్రంప్ కి అసలు గుర్తురావడంలేదు.

ట్రంప్ కి ఓటమి భయం పట్టుకుందో లేక అసహనానికి లోను అవుతున్నారో తెలియదు కానీ ఆయన నోటి వెంట వినకూడని మాటలే వస్తున్నాయి. లేకపోతే భారత ప్రధాని మోడీని గుండెలకు హత్తుకున్న పెద్ద మనిషే భారత్ మురికిదేశమని ఎలా అనగలరు. భారత్ పట్ల ఇంత కర్కశ‌త్వం ఎలా చూపగలరు. అంతేనా భారత్ మీద విషం కక్కుతున్నారు. తనకు ద్రోహం చేసిన దేశాల సరసన కలుపుతున్నారు.

నిజానికి ట్రంప్ మళ్ళీ గెలవాలని మోడీ గట్టిగా కోరుకున్నారని అంటారు. అందుకోసమే ఆయన నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని, హౌడీ మోడీని కూడా చేపట్టారని చెబుతారు. కానీ ఎందుకో భారత్ అంటే నిప్పులు కురిపిస్తున్నారు ట్రంప్. దీంతో ఆయనతో స్నేహం చేసిన పుణ్యానికి భరత్ లోని విపక్షాల నోటి నుంచి మోడీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మీ మిత్రుడు భారత్ ని మురికి అన్న మాట వాడారు, మీరేమంటారు మోడీ జీ అంటూ కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. మీ స్నేహం ఫలితం ఇదేనా అంటూ ఎకసెక్కం ఆడుతున్నారు. మొత్తానికి ట్రంప్ నోటి దురుసుతో మోడీని కూడా భారత్ లో  ఇబ్బందుల పాలు చేస్తున్నారు అంటున్నారు. అంతేనా ఆయన తరువాత వచ్చిన కొత్త ప్రెసిడెంట్ తో కూడా భారత్ కి ఇబ్బందులు కలిగేలా చేస్తున్నారు అని కూడా  అంటున్నారు. చూడాలి మరి ఆ వాచాలత్వం ఎంతదాకా వెళ్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: