ఈ మధ్యకాలంలో లక్ష్మీదేవి కటాక్షం పొంది కోట్లకు పడగలెత్తిన కుబేరులు సైతం ఒక్కసారిగా కుప్పకూలి పోవడం చూస్తూనే ఉన్నాం.... టైం బాగా లేకపోవడం అంటే ఇదేనేమో. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ మిట్టల్‌కు స్వయానా సోదరుడు ప్రమోద్ మిట్టల్ అందరికీ సుపరిచితులే. వ్యాపారంలో ఆరితేరి కోట్లు సంపాదించి లండన్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త అప్పుల్లో కూరుకుపోయారు. వేలు కాదు లక్షల కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. దాదాపు 24 వేల కోట్ల రూపాయల అప్పున్నట్టు లండన్ హైకోర్టుకు తెలిపారు ప్రమోద్‌. దీంతో బ్రిటన్‌ చరిత్రలోనే అతిపెద్ద దివాళా కేసుగా రికార్డులు సృష్టించారు ఈ ప్రముఖ వ్యాపారవేత్త. అయితే ఈయన ఇంతగా దివాలా తీయడానికి కారణం బొగ్గు కంపెనీ. ఈ కంపెనీ కారణంగానే దారుణంగా అప్పుల్లో మునిగి పోయారు.

2006లో బోస్నియన్ కోక్ తయారీ కంపెనీ జికిల్ రుణాలకు తన గ్లోబల్ స్టీల్ హోల్డింగ్ తరఫున హామీ ఇస్తూ సంతకం పెట్టారు ప్రమోద్‌. అయితే 166 మిలియన్‌ డాలర్లను తిరిగి చెల్లించడంలో జికిల్‌ విఫలమైంది. దీంతో అప్పు ఇచ్చిన మార్గెట్‌ కంపెనీ... ఇప్పుడు హామీ సంతకం పెట్టినందుకు గాను ప్రమోద్ పై భారాన్ని మోపుతోంది. ఆ మొత్తాన్ని ప్రమోద్‌ మిట్టల్‌ నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో అంత మొత్తాన్ని తాను చెల్లించలేనంటూ దివాళా ప్రకటించారు మిట్టల్‌.

తనకు ఎన్నో సమస్యలతో ఆదాయం లేక భార్య పై ఆధారపడి జీవిస్తున్నారని....2 వేల నుండి 3 వేల పౌండ్ల తన నెలవారీ ఖర్చులు కూడా భార్య, కుటుంబం సభ్యుల పైన ఆధారపడి వెతుకుతున్నట్లు తెలియజేశారు. దివాలా కేసులో కోర్టు ఖర్చును మూడవ పక్షం భరిస్తోందని కోర్టుకు తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా  ప్రమోద్‌ మిట్టల్‌ పై మోప బడ్డాయి. ఈ క్రమంలో 2019లో బోస్నియాలో అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే, భారత్‌లోనూ 2 వేల 200 కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడ్డారని ప్రమోద్ మిట్టల్ పై కేసు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: